- అన్ని మున్సిపాలిటీల్లో దాదాపు అదే పరిస్థితి
- ఉమ్మడి జిల్లాలో బీసీలకు 7 డివిజన్లు, 33 వార్డులు రిజర్వ్
ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలు నినాదం ఎత్తుకున్నాయి. జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు అదే స్థాయిలో కౌన్సిలర్, కార్పొరేటర్ సీట్లు కేటాయించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ బిల్లుపై హైకోర్టులో కేసు పెండింగ్ ఉండడంతో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
ఆ మేరకు పంచాయతీల్లో బీసీలకు అవకాశం కల్పించడంతో పెద్ద సంఖ్యలో వార్డు మెంబర్లు, సర్పంచులుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అదే ఒరవడిని కొనసాగిస్తూ బీసీలకు కౌన్సిలర్, కార్పొరేటర్ టికెట్ల కేటాయింపులో పెద్దపీట వేసింది. దీంతో మిగతా పార్టీలు సైతం అదే బాటలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది.
భారీ సంఖ్యలో ఓటు బ్యాంకు కలిగిన బీసీలను నిర్లక్ష్యం చేస్తే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయనే భయం అన్ని పార్టీలకు పట్టుకుంది. ఈ కారణంగా మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వుడ్ సీట్లతోపాటు అన్ రిజర్వుడ్ (జనరల్) స్థానాల్లోనూ పోటాపోటీగా బీసీ అభ్యర్థులను ప్రకటించాయి.
కొత్తగూడెం లో 7 డివిజన్లు బీసీలకు రిజర్వ్..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో 7 డివిజన్లు బీసీలకు రిజర్వ్ కాగా, కాంగ్రెస్ ఏకంగా 20 మంది బీసీ అభ్యర్థులను బరిలోకి దించింది. అశ్వారావుపేట, ఇల్లెందు, సత్తుపల్లి, వైరా, ఏదులాపురం, కల్లూరు, మధిర మున్సిపాలిటీల్లో మొత్తం 33 వార్డులు బీసీలకు రిజర్వ్ అయ్యాయి.
వీటన్నింటిలోనూ రిజర్వుడ్ సీట్ల కంటే ఎక్కువగా జనరల్ సీట్లలో కూడా బీసీలకు అవకాశం కల్పించారు. దీంతో రిజర్వుడ్ సీట్ల కంటే ఎక్కువగా వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా బీసీలు ఎన్నికకానున్నారు. ఇక చైర్మన్లలోనూ జనరల్ మహిళకు రిజర్వ్ అయిన నాలుగు మున్సిపాలిటీల్లో ఒక స్థానంలో బీసీ మహిళ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ గా బీసీ మహిళకు రిజర్వ్ అయింది. కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ జనరల్‌కు, అశ్వారావుపేట మున్సిపాలిటీ, మధిర, వైరా, సత్తుపల్లి జనరల్ మహిళకు, కల్లూరు ఎస్టీ జనరల్ కు, ఏదులాపురం చైర్ పర్సన్ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది.
