రెండో రోజూ కుండపోతే..ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో దంచికొట్టిన వర్షం

రెండో రోజూ కుండపోతే..ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో దంచికొట్టిన వర్షం
  • ఉగ్రరూపం దాల్చిన వాగులు, జలపాతాలు 
  •     పలు ప్రాంతాలకు నిలిచిన రాకపోకలు
  •     అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. సహాయక చర్యలు
  •     హెల్ప్​లైన్​నంబర్ల ఏర్పాటు
  •     పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ 

నెట్ వర్క్ , వెలుగు: ఎల్​నినో ప్రభావంతో వర్షాలు పడవని భయపడుతున్న ప్రజలు, రైతులపై వరుణ దేవుడు కరుణించాడు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్​జిల్లాల్లో రెండో రోజు కూడా భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, చెరువులు, ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఆదిలాబాద్​జిల్లావ్యాప్తంగా గురువారం 51 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తలమడుగు మండలంలో 131.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతమైన కుంటాల రెండు నెలల తర్వాత ఉగ్ర రూపం దాల్చింది. అటు పొచ్చర, గాయత్రి జలపాతాలకు సైతం భారీ వరద నీరు చేరుతోంది. అటు మత్తడివాగు, సాత్నాల ప్రాజెక్టులు నీటి మట్టం పెరిగింది. 

జిల్లా వ్యాప్తంగా వాగులు ఉప్పొంగడంతో పలుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. వర్షాలు, వరదలకు సంబంధించిన అత్యవసర పరిస్థితులు లేదా సహాయం కోసం టోల్‌‌‌‌-ఫ్రీ నంబర్ 1800 425 1939ను సంప్రదించాలని కలెక్టర్​రాజర్షి షా సూచించారు. జగిత్యాల జిల్లాలో వాగులు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల పాత ఇళ్లు, గోడలు కూలిపోగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్‌‌‌‌తో కలిసి ఇబ్రహీంపట్నం మండలంలోని యామాపూర్-ఫకీర్, కొండాపూర్ గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగును పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కోరుట్ల మండలం కల్లూరు గ్రామంలోని లో లెవల్​బ్రిడ్జిని సైతం పరిశీలించారు.

పెద్దపల్లి జిల్లాలో 8.17 సెంటీమీటర్ల వర్షం

పెద్దపల్లి జిల్లాలో 8.17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాగులు, చెరువులు మత్తడి దుంకుతున్నాయి. జిల్లాలోని గ్రామీణ రోడ్లు అక్కడక్కడా తెగిపోయాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు గంటగంటకు ఒక టీఎంసీ చొప్పున పెరుగుతూ వస్తోంది. గురువారం సాయంత్రం వరకు నీటిమట్టం 16.21 టీఎంసీలుగా ఉంది.  పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పలు రహదారులు వరద నీటిలో మునిగిపోయాయి. ఇందిరానగర్, రామగుండం పాతబజార్​లో పలు ఇండ్లలోకి వర్షపు నీరు, యైటింక్లయిన్​కాలనీ, ఉదయ్​నగర్​లోని సింగరేణి క్వార్టర్లలోకి డ్రైనేజీ నీరు చేరడంతో ప్రజలు, కార్మికులు అవస్థలు పడ్డారు. ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​, మేయర్​ మహాంకాళి స్వామి, డిప్యూటీ మేయర్​ పాతపెల్లి ఎల్లయ్య, ఇతర అధికారులు వెళ్ళి సహయ చర్యలు చేపట్టి బాధితులకు భరోసా కల్పించారు. రామగుండం 29వ డివిజన్​ లింగాపూర్​కు చెందిన రైతు తిప్పని రాములుకు చెందిన రెండు బర్రెలు వరదలో కొట్టుకునిపోయి చనిపోయాయి.

అధికారులు అలర్ట్​ 

నిర్మల్ జిల్లాలో 54.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కడెం మండలంలో 122 మిల్లీ మీటర్ల వర్షం పడింది. జిల్లాలోని అన్ని చెరువులు నిండిపోయాయి. నిర్మల్ పట్టణంలోని ఇందిరానగర్, శాస్త్రి నగర్, బస్ డిపో బోయవాడ వార్డులు ముంపునకు గురయ్యాయి. పెంబి, దస్తురాబాద్, కడెం, ఖానాపూర్, మామడ తదితర మండలాల్లోని వాగులు పొంగిపొర్లుతున్నాయి.  కలెక్టర్ భవేష్ మిశ్రా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ అధికార యంత్రాంగాన్ని అలర్ట్​ చేశారు. కలెక్టరేట్​లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి హెల్ప్ లైన్ నంబర్ 9100577132 అందుబాటులో ఉంచారు. అధికారులు 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు. 

అధికారులకు సెలవులు రద్దు

కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షానికి వాగులు ప్రవహిస్తున్నాయి. నిజాంసాగర్​ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 5,600 క్యూసెక్కుల వరద వస్తోంది. పాల్వంచ,  బీమేశ్వరం వాగు, గాంధారి, లింగంపేట వాగులు ప్రవహిస్తున్నాయి. ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్​ఆశిష్ ​సంగ్వాన్​ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాత ఇండ్లలో ప్రజలు నివసించకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాల్వంచ వాగు ఉధృతిని ఎస్పీ రాజేశ్​చంద్ర పరిశీలించారు. నిజామాబాద్ కలెక్టరేట్​లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అత్యవసర సమయంలో 08462 -220183 నంబర్​సంప్రదించాలని అడిషనల్ కలెక్టర్ భుజంగరావు సూచించారు.

 మిడ్ మానేర్ కు భారీ ఇన్ ఫ్లో 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెరువులు నిండి, వాగులు పారుతున్నాయి. గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరు ప్రాజెక్ట్ లోకి పాల్వంచ వాగు నుంచి వరద వస్తోంది. సిరిసిల్లలోని పెద్దబజార్ లో భారీచెట్టు ఓ కారుపై విరిగిపడడంతో కారు నడిపే వ్యక్తి ఆర్కోటి రాజుకు గాయాలయ్యాయి. బోయినిపల్లి మండలం మన్వాడలోని మిడ్ మానేర్​కు భారీగా ఇన్ ఫ్లో వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 17,242 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. ప్రాజెక్ట్ నీటిమట్టం 318 మీటర్లకు గాను 308.21 మీటర్లకు చేరుకుంది. కోనరావుపేట మండలంలోని మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మూల వాగుపై ఉన్న కాజ్వేలు కొట్టుకుపోయి పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఆసిఫాబాద్ జిల్లాలో రాకపోకలు బంద్

ఆసిఫాబాద్ జిల్లాలో కుండపోత వర్షంతో జిల్లాని అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి వాగు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 20 గ్రామాలకు పైగా రాకపోకలు స్తంభించిపోయాయి.  పెంచికల్​పేట్ మండలం కొండపల్లి గొల్లవాడ మధ్య నిర్మాణంలో ఉన్న వంతెన పక్కనుంచి వాగు దాటే క్రమంలో వరద ఉధృతికి బొలెరో వాహనం చిక్కుకుంది. స్థానిక గ్రామస్తులు గమనించి జేసీబీ సాయంతో బయటకు తీశారు. అందులో పశువులు ఉండగా వాటిని సురక్షితంగా బయటకు తీశారు. కుమ్రంభీం ప్రాజెక్టు 6 గేట్లు, వట్టివాగు ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి వరదనీటిని దిగువకు వదిలారు. గుండి వాగు, కుమ్రంభీం ప్రాజెక్టు వరద ఉధృత్తిని కలెక్టర్ కె.హరిత పరిశీలించారు. దహెగాం మండలం లగ్గాం వద్ద వరద ఉదృతిని ఎస్పీ నితికా పంత్, డీఎస్పీ వహీదుద్దీన్​తో కలిసి పరిశీలించారు. ప్రజలకు తక్షణ సహాయం కోసం కలెక్టరేట్‌‌‌‌లో ప్రత్యేక కంట్రోల్ నంబర్ 8500844365 ఏర్పాటు చేశారు.