- భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో దంచికొట్టిన వాన
- రెండు జిల్లాల్లోని పలు మార్గాల్లో కొట్టుకుపోయిన రోడ్లు
- వాజేడు మండల పరిధిలో 24 ఊర్లకు రాకపోకలు బంద్
- వరంగల్ సిటీని వదలని ముసురు
- పొలం పనుల్లో ఉత్సాహంగా రైతులు
వరంగల్/భూపాలపల్లి/ములుగు/మహబూబాబాద్, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడో రోజూ వాన వదల్లేదు. మంగళవారం ఉదయం మొదలైన వాన బుధ, గురువారాల్లోనూ కురుస్తూ, గెరువిస్తూ దంచికొట్టడంతో వాతావరణం చల్లగామారింది. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో బుధవారం గురువారం కురవగా.. మహబూబాబాద్, జనగామ జిల్లాలతో పాటు గ్రేటర్ వరంగల్‌ను ముసురు వదల్లేదు. ఎల్‌నినో ప్రభావంతో దాదాపు నెలన్నరపాటు వర్షాల కోసం ఎదురుచూస్తూ కప్పతల్లి ఆటలాడిన రైతులు ప్రస్తుతం జోరుగా కురుస్తున్న వానలతో పొలంబాట పట్టారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో మహిళా రైతులు ఆడుతూపాడుతూ ఉత్సాహంగా నాట్లు వేశారు.
వాజేడు– చత్తీస్‌గఢ్ రాకపోకలు బంద్
ములుగు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 8.32 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వాజేడు మండలంలో అత్యధికంగా 19.22 సెం.మీ, వెంకటాపురంలో 16.84 సెం.మీ వర్షపాతం నమోదైంది. వాజేడు మండలం చీకుపల్లి 163 నేషనల్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చత్తీస్‍గడ్‍తో పాటు వాజేడు మండలంలోని 24 గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచింది. బొగత వాటర్ ఫాల్ వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సందర్శకులను అనుమతించడంలేదు.
వెంకటాపురం మండలం పాలెంవాగు ప్రాజెక్ట్ నీటిమట్టం 134 మీటర్లు కాగా ప్రస్తుతం 125.5 మీటర్లకు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి ప్రవాహం బుధవారం ఉదయం 95,600 క్యూసెక్కులు ఉండగా గురువారం ఉదయం నాటికి 1,85,600 క్యూసెక్కులకు చేరింది. మేడారం జంపన్నవాగులో వరద ఉధృతితో హరిత హోటల్ వరకు నీళ్లు వచ్చాయి. మంగళవారం జంపన్న వాగులో కొట్టుకుపోయిన తిమ్మయ్య కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
గ్రేటర్ వరంగల్‌లో జనం ఇబ్బందులు
గ్రేటర్ వరంగల్‌లో మంగళవారం రాత్రి నుంచి ఉదయం వరకు వర్షం దంచికొట్టింది. బుధవారం ఉదయం నుంచి మొదలైన ముసురు గురువారం కూడా పడుతూనే ఉంది. సిటీ ప్రాంతం కావడంతో ఉదయం, సాయంత్రం వేళ స్కూళ్లకు వెళ్లే పిల్లలు, ఉద్యోగులు రోడ్లపై తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల మంచినీటి పైపుల రిపేర్లు, ఇతరత్రా అభివృద్ధి కోసం రోడ్లను తవ్వడంతో అందులోకి వరదనీరు చేరింది.
మేడిగడ్డకు పోటెత్తిన వరద
జయశంకర్ భూపాలపల్లి పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం 1,54,700 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 2,3 ఉపరితల గనుల్లోకి నీరు చేరి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు 14 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో నిలిచిపోవడంతో రూ.9 కోట్ల నష్టం వాటిల్లింది. జిల్లాలోని చిట్యాల, టేకుమట్ల మండలాల పరిధిలో మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కాల్వపల్లి, ఓడేడు, బుర్నపల్లి, కిష్టంపేట గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన తాత్కాలిక మట్టి రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో పెద్దపల్లి జిల్లాతో పాటు మంచిర్యాల, గోదావరిఖని ప్రాంతాలకు రాకపోకల్ బంద్ అయ్యాయి.
