గోదావరి ట్రిబ్యునల్ కావాలట!ఏపీ కొత్త కుట్ర.. పోలవరం– నల్లమల సాగర్ కడతామని వెల్లడి

గోదావరి ట్రిబ్యునల్ కావాలట!ఏపీ కొత్త కుట్ర.. పోలవరం– నల్లమల సాగర్ కడతామని వెల్లడి
  • కృష్ణాతో పాటు గోదారిజలాలపైనా ఏపీ కన్ను
  • మనకు టీఏసీ క్లియరెన్స్​ వచ్చిన 8 ప్రాజెక్టులపైనా అక్కసు
  • ఇప్పుడున్న 518 టీఎంసీలు సరిపోవంటూ ఏపీ వాదన
  • 750 టీఎంసీలకు కేటాయింపులు పెంచాలంటూ డిమాండ్​
  • పోలవరం బనకచర్లను రెండు దశల్లో చేపడుతున్నట్టు వెల్లడి
  • కేంద్ర కమిటీ మీటింగ్​కు అజెండా ఖరారు

హైదరాబాద్, వెలుగు: గోదావరి జలాలపైనా ఏపీ కన్నేసింది. ఓవైపు కృష్ణా జలాలను తన్నుకుపోతూనే.. మరోవైపు గోదావరి నదీజలాలపైనా లెక్కకు మించి హక్కులు సాధించేందుకు కుట్రలు చేస్తున్నది. ఇప్పటికే గోదావరిలోనూ కేటాయింపులకు మించి వాడుకుంటున్న పొరుగు రాష్ట్రం.. అసలు కేటాయించిన నీళ్లే సరిపోవని, కోటాలో కేటాయింపులు పెంచాలని, పునఃపంపిణీ చేయాలని డిమాండ్​ చేస్తున్నది. అందులో భాగంగానే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాల పరిష్కారానికి సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ) చైర్మన్​ నేతృత్వంలో కేంద్రం ఏర్పాటు చేసిన కేంద్ర కమిటీకి సమర్పించిన అజెండాలో ఇన్​డైరెక్ట్​గా ఆ అంశాన్ని లేవనెత్తింది. కృష్ణా జలాలపై వేసినట్టే కొత్తగా గోదావరి ట్రిబ్యునల్​ను ఏర్పాటు చేయాలని, రెండు రాష్ట్రాలకు మళ్లీ కేటాయింపులు చేయాలని డిమాండ్​ చేసింది. అంటే ఇప్పటికే రెండు రాష్ట్రాలకు కలిపి 1,486 టీఎంసీల జలాలను కేటాయించగా.. తెలంగాణకు 968 టీఎంసీలు, ఏపీకి 518 టీఎంసీలు 1980లో బచావత్​ ట్రిబ్యునల్​ కేటాయించింది. అయితే, ఇటీవల జరిగిన మీటింగ్​లో ఆ కేటాయింపులు సరిపోవని, 750 టీఎంసీలు కావాలని ఏపీ వాదించింది. ఆ క్రమంలోనే కొత్తగా గోదావరి ట్రిబ్యునల్​ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్​ పెట్టింది.అంతేకాకుండా.. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం 1956 సెక్షన్​ 3 ఫర్దర్​ టర్మ్స్​ ఆఫ్​ రిఫరెన్స్​పై కేంద్రానికి తాము ఫిర్యాదు చేశామని, దానిని రద్దు చేయాలన్న ప్రతిపాదననూ ఎజెండాలో ఏపీ పెట్టింది.

మనకు క్లియరెన్సులు ఉన్నప్రాజెక్టులపైనా అక్కసు

కేంద్రం నుంచి మనకు క్లియరెన్సులు వచ్చిన 8 ప్రాజెక్టులపైనా ఏపీ అక్కసు వెళ్లగక్కింది. ఇప్పటికే టెక్నికల్​ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) అనుమతులిచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు, దేవాదుల లిఫ్ట్​ స్కీమ్, ఇంటిగ్రేటెడ్​ సీతారామ సీతమ్మ సాగర్​ లిఫ్ట్, చిన్న కాళేశ్వరం లిఫ్ట్, మోడికుంటవాగు, కడెం లిఫ్ట్​ (గూడెం), చనాక కొరాట బ్యారేజీలపైనా అభ్యంతరాలను వ్యక్తం చేసింది. మీటింగ్​లో వాటిపైనా చర్చించాలని అజెండాలో పేర్కొంది. ఇక వాటితో పాటు సమ్మక్కసాగర్, తుమ్మిడిహెట్టి, వార్ధా ప్రాజెక్టులపైనా అభ్యంతరాలు తెలిపింది. మొత్తంగా గోదావరిపై ఉన్న 11 ప్రాజెక్టులపై చర్చించాలని డిమాండ్​ చేస్తున్నది. ఇక అవేకాకుండా కృష్ణా బేసిన్​లోని మన ప్రాజెక్టులనూ ఏపీ వ్యతిరేకిస్తున్నది. ట్రిబ్యునల్​ కేటాయింపులే తెలంగాణకు లేవని, లేకుండానే కృష్ణాపైనా ప్రాజెక్టులు కడుతున్నదని, దానిపైనా చర్చించాలని పట్టుబట్టింది. కృష్ణా బోర్డు పరిధిని నిర్ణయించే విషయంపైనా మీటింగ్​లో చర్చించాలని ఎజెండాలో పేర్కొంది. 

మరో రెండు మూడు రోజుల్లో అజెండాల మార్పిడి

గత నెల 30న జరిగిన తొలి మీటింగ్​లో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అజెండానూ ఇవ్వలేదు. ఏపీ మాత్రం అజెండాతో పాటు పవర్​ పాయింట్​ ప్రెజెంటేషన్​ కూడా ఇచ్చింది. తెలంగాణ మాత్రం పోలవరం బనకచర్లను అజెండాలో చేరిస్తే చర్చించేది లేదంటూ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే వారంలో రెండు రాష్ట్రాలు అజెండాలను మార్చుకోవాలని సీడబ్ల్యూసీ చైర్మన్​ సూచించారు. మరో రెండు మూడు రోజుల్లో రెండు రాష్ట్రాలూ తమ అజెండాలను మార్పిడి చేసుకునే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. ఆ తర్వాత రెండు రాష్ట్రాల అభ్యంతరాలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని 15 రోజుల్లో ఎజెండాలను సీడబ్ల్యూసీ ఖరారు చేసి మీటింగ్​ నిర్వహించే అవకాశాలున్నాయి.

అజెండాలో బనకచర్ల ప్రాజెక్ట్​ కూడా..

అజెండాలో పోలవరం బనకచర్ల లింక్​ ప్రాజెక్టును పెడితే చర్చించేది లేదని తెలంగాణ తెగేసి చెబుతున్నా.. ఏపీ మాత్రం పట్టనట్టే వ్యవహరిస్తున్నది. తన అజెండాలో పోలవరం బనకచర్ల ప్రాజెక్టునూ చేర్చింది. రోజూ 2 టీఎంసీల చొప్పున వరద రోజుల్లో 200 టీఎంసీలు తరలించేలా ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టు పేర్కొంది. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో చేపడుతున్నట్టు అజెండా నోట్​లో వెల్లడించింది. తొలి దశలో పోలవరం నుంచి నల్లమలసాగర్​కు వరద జలాలను తరలిస్తామని, సాగు తాగు అవసరాలతో పాటు పరిశ్రమల అవసరాలు తీర్చేలా వాటిని వాడుకుంటామని స్పష్టం చేసింది.