గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబానికి జగన్ పరామర్శ

గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబానికి జగన్ పరామర్శ

గుంటూరు: గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ పరామర్శించారు. అంబటి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. భయపడాల్సిన పని లేదని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబును రాజమండ్రి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1న అంబటి రాంబాబును గుంటూరు ప్రత్యేక సివిల్  కోర్టులో హాజరు పరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

జనవరి 31న వైసీపీ చేపట్టిన పాప ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న అంబటిపై టీడీపీ కార్యకర్తలు కర్రలతో, రాళ్లతో దాడికి యత్నించారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన అంబటి.. టీడీపీ కార్యకర్తలు, సీఎం చంద్రబాబుపై ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామంతో మరింత రగిలిపోయిన టీడీపీ కార్యకర్తలు గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంటిపై రాళ్లతో దాడి చేసి.. ఇంటికి నిప్పంటించారు. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో కాక రేపింది. గుంటూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.