హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన అద్భుత ప్రపంచం 'పండోర' మరోసారి వెండితెరపై ఆవిష్కృతమైంది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అవతార్: ఫైర్ అండ్ యాష్' (Avatar: Fire And Ash) ఎట్టకేలకు థియేటర్లలోకి ఈ రోజు( డిసెంబర్ 19న ) వచ్చేసింది. మొదటి రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద 2 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించడంతో.. ఇప్పుడు ఈ మూడవ భాగంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
బాక్సాఫీస్ వద్ద ముందడుగు..
ప్రస్తుత సినీ ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. 'అవతార్ 3' ప్రపంచవ్యాప్తంగా మొదటి వారాంతంలో 340 మిలియన్ డాలర్ల నుండి 380 మిలియన్ డాలర్ల మధ్య వసూలు చేసే అవకాశం ఉంది. ఇందులో దాదాపు 250- నుంచి 275 మిలియన్ డాలర్లు కేవలం ఓవర్సీస్ మార్కెట్ నుంచే వస్తాయని భావిస్తున్నారు. ఇక్కడ డిసెంబర్ 17 నుంచే కొన్ని దేశాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ఇక అమెరికా, కెనడాల్లో ఈ చిత్రం మొదటి 3 రోజుల్లో 90- నుంచి105 మిలియన్ల డాలర్లు ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆందోళన కలిగిస్తున్న ఓపెనింగ్స్!
అయితే, రెండో భాగం 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'తో పోలిస్తే ఈ వసూళ్లు కొంత తక్కువగానే ఉన్నాయి. 'అవతార్ 2' మొదటి వారాంతంలో ఏకంగా 441.6 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.. దానితో పోలిస్తే మూడవ భాగం వసూళ్లలో 13 నుండి 23 శాతం వరకు తగ్గుదల కనిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ఇది కొంత ఆందోళన కలిగించే విషయమే.
హైప్ తగ్గడానికి కారణమేంటి?
మొదటి భాగానికి (2009), రెండో భాగానికి (2022) మధ్య దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘ విరామం ఉంది. ఆ గ్యాప్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచింది. కానీ మూడవ భాగం కేవలం మూడేళ్ల వ్యవధిలోనే రావడంతో ఆ స్థాయి ఎగ్జైట్‌మెంట్ కొంత మిస్ అయినట్లు కనిపిస్తోంది. జేమ్స్ కామెరూన్ అంటేనే విజువల్ వండర్. ప్రతిసారీ ఏదో ఒక కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తారు. ఈసారి 'ఫైర్ అండ్ యాష్'లో అగ్ని పర్వతాల నేపథ్యంలో సాగే నావి తెగలను చూపించించారు.
రికార్డుల మధ్య 'అవతార్ 3'
వసూళ్లు తగ్గాయని అనుకున్నప్పటికీ, పోస్ట్-కోవిడ్ కాలంలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా 'అవతార్ 3' నిలవనుంది. 2009 వచ్చిన అవతార్ 1 దాదాపు 232 మిలియన్ డాలర్లు ఓపెనింగ్ తో మంచి వసూళ్లు రాబట్టింది. అటు అవతార్ 2 (2022) కూడా 441 మిలియన్ డాలర్ల ఓపెనింగ్ తో ఊపేసింది. కానీ అవతార్ 2 మాత్రం 340 నుంచి365 మిలియన్ డాలర్ల మేరకు వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు ట్రేడ్ వర్గాలు.
►ALSO READ | Miss Terious Movie Review: ఉత్కంఠ రేపే క్రైమ్ థ్రిల్లర్ 'మిస్ టీరియస్'.. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయింది!
దీని ప్రకారం అవతార్ 3.. మొదటి భాగం కంటే మెరుగైన ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, రెండో భాగం రికార్డును అందుకోలేకపోయింది. అయినప్పటికీ, జేమ్స్ కామెరూన్ సినిమాలకు 'లాంగ్ రన్' అనేది చాలా ముఖ్యం. 'మౌత్ టాక్' బాగుంటే, రానున్న రోజుల్లో వసూళ్లు పెరిగి మరోసారి 2 బిలియన్ డాలర్ల మార్కును దాటే అవకాశం పుష్కలంగా ఉంది.
భారత్‌లో ధురందర్ నుండి గట్టి పోటీ!
భారతదేశంలో కూడా 'అవతార్ 3'కి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఇండియాలోని ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్స్‌లో దాదాపు 4,35,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఇండియాలో తొలిరోజు రూ. 25 నుండి 30 కోట్ల మేర వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. అయితే, అవతార్ చిత్రానికి బాలీవుడ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. రణవీర్ సింగ్ నటించిన 'ధురందర్' (Dhurandhar) బాక్సాఫీస్ వద్ద ఒక తుఫానులా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ఇండియాలో రూ. 500 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. నార్త్ ఇండియాలో 'ధురందర్' ప్రభంజనం కారణంగా అవతార్ వసూళ్లపై కొంత ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పండోర గ్రహంపై అగ్ని తెగకు, సుల్లీ కుటుంబానికి మధ్య జరిగే ఈ పోరాటం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి. టెక్నికల్ వండర్స్, ఎమోషనల్ స్టోరీలైన్ కనెక్ట్ అయితే మాత్రం బాక్సాఫీస్ వద్ద మళ్ళీ 'అవతార్' సునామీ ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.
