ఢాకా: బంగ్లాదేశ్ స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ హాదీ సింగపూర్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ క్రమంలో హాదీ హత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హాదీపై కాల్పులు జరిపిన వ్యక్తిని ఫైసల్ కరీంగా గుర్తించారు పోలీసులు.
హాదీపై కాల్పులకు ముందు రోజు రాత్రి ఢాకాలో ఒక రిసార్ట్‌లో తన గర్ల్ ఫ్రెండ్‌తో గడిపిన ఫైసల్.. మొత్తం బంగ్లాదేశ్ షేక్ కాబోయే ఘటన ఒకటి జరగబోతుందని తన ప్రియురాలికి చెప్పాడని పోలీసులు వెల్లడించారు. హాదిపై ప్రీ ప్లాన్డ్గా దాడి చేశారని.. ఇందులో చాలా మంది వ్యక్తుల ప్రమేయం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
పైసల్ తన గర్ల్ ఫ్రెండ్‌కు చెప్పినట్లుగానే హాదీ హత్య తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. హాదీ అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. హదీని చంపిన తర్వాత హంతకులు ఇండియా పారిపోయారని ఆరోపిస్తూ భారతకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఇండియా హాదీ హంతకులను అప్పగించే వరకు బంగ్లాదేశ్లో భారత హైకమిషన్ కార్యాలయాన్ని మూసివేయాలని డిమాండ్ చేశారు.
Also Read : బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తిని కొట్టి, నిప్పంటించిన ఆందోళనకారులు
ఈ క్రమంలోనే మైమెన్‌సింగ్ జిల్లాలోని భలుకాలో ఇస్లాంను అవమానించాడనే ఆరోపణలపై 30 ఏళ్ల దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిపై ఓ వర్గం మూకుమ్మడిగా దాడి చేసి చంపేశారు. అంతేకాకుండా ఢాకాలోని ది డైలీ స్టార్, ప్రోథోమ్ అలో మీడియా సంస్థలపై దాడులు చేయడంతో పాటు బంగ్లా జాతిపిత, షేక్ హసీనా తండ్రి ముజీబ్ ఉర్ రెహ్మన్ ఇంటిని తగలబెట్టారు.
