హీరో, TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2015–16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను విషయంలో రూ.1.50 కోట్ల జరిమానా చెల్లించాలని ఐటీ శాఖ గతంలో నోటీసులు జారీ చేసింది.
ఈ జరిమానా విధింపును సవాల్ చేస్తూ, విజయ్ 2022లో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, గత నెలలో తీర్పును రిజర్వ్ చేసింది. ఇక ఇవాళ శుక్రవారం (Feb 6, 2026న) తుది తీర్పును వెల్లడించింది హైకోర్టు. ఈ మేరకు విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ సెంథిల్‌కుమార్ రామమూర్తి తుది తీర్పును వెలువరించారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 263 ప్రకారం, ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులు చట్టబద్ధమైనవేనని, అవి నిర్ణీత కాలపరిమితిలోనే జారీ అయ్యాయని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో విజయ్ అభ్యర్థనను తిరస్కరించిన న్యాయస్థానం, జరిమానా కొనసాగుతుందని తేల్చిచెప్పింది.
అయితే, కాలపరిమితి అంశాన్ని తప్పించి ఇతర కారణాల ఆధారంగా ఈ కేసును ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT) వద్ద సవాల్ చేసే స్వేచ్ఛను విజయ్‌కు హైకోర్టు కల్పించింది.
