బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తిని కొట్టి, నిప్పంటించిన ఆందోళనకారులు

బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తిని కొట్టి, నిప్పంటించిన ఆందోళనకారులు

ఢాకా: భారత పొరుగు దేశం బంగ్లాదేశ్ మరోసారి అల్లర్లతో అట్టుడికిపోతోంది. స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్యతో దేశవ్యాప్తంగా హింసాత్మక అల్లర్లు చెలరేగాయి. షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలోనే మైమెన్‌సింగ్ జిల్లాలోని భలుకాలో ఇస్లాంను అవమానించాడనే ఆరోపణలపై 30 ఏళ్ల దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిపై ఓ వర్గం మూకుమ్మడిగా దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ దీపు చంద్ర దాస్ మరణించాడు. 

అప్పటికీ శాంతించని నిరసనకారులు చంద్ర దాస్ మృతదేహాన్ని తగలబెట్టినట్లు బంగ్లాదేశ్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం దీపు చంద్ర దాస్ హత్యను తీవ్రంగా ఖండించింది. బంగ్లాదేశ్‎లో హింసాకు చోటు లేదని స్పష్టం చేశారు. దీపు చంద్ర దాస్ మరణానికి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని హెచ్చరించింది. ఈ క్లిష్ట సమయంలో హింసను ప్రోత్సాహించకుండా ఉస్మాన్ బిన్ హాదీ గౌరవించాలని యువతకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. 

ప్రభుత్వ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా 2024 జూలై, ఆగస్టులో బంగ్లాదేశ్‏లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ప్రభుత్వంపై యువత తిరుగుబాటు చేసింది. భారతదేశాన్ని బహిరంగంగా విమర్శించే రాడికల్ ఇస్లామిస్ట్ షరీఫ్ ఉస్మాన్ హదీ ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. ఈ తిరుగుబాటు కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. అల్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారడంతో ప్రాణ భయంతో ఆమె దేశ విడిచిపారిపోయి ఇండియాలో తలదాచుకుంటుంది. 

►ALSO READ | అమెరికాలో గ్రీన్ కార్డ్ లాటరీ బంద్.. బ్రౌన్ యునివర్సిటీ కాల్పుల వల్లే నిర్ణయం...

ఈ క్రమంలో షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యకు గురి కావడంతో బంగ్లాదేశ్‎లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. హదీని చంపిన హంతకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది అతడి అనుచరులు రోడ్డెక్కి విధ్వంసం సృష్టించారు. ఢాకాలోని ది డైలీ స్టార్, ప్రోథోమ్ అలో మీడియా సంస్థలపై దాడులు చేయడంతో పాటు బంగ్లా జాతిపిత, షేక్ హసీనా తండ్రి ముజీబ్ ఉర్ రెహ్మన్ ఇంటిని తగలబెట్టారు. 

మరోవైపు.. షేక్ హసీనాను బంగ్లాకు అప్పగించకుండా ఆశ్రయం ఇస్తుండటంతో ఇండియాపై హదీ అనుచరులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే భారత వ్యతిరేక నిరసనల్లో ఇస్లాంను అవమానించాడని ఆరోపిస్తూ దీపు చంద్రదాస్ అనే హిందు వ్యక్తిని కొట్టి చంపారు. అక్కడితో ఆగకుండా మృతదేహాన్ని చెట్టుకు వేలాడ దీసి నిప్పంటించి రాక్షసానందం పొందారు.