ఉద్యోగులకు వాషింగ్టన్ పోస్ట్ షాక్.. 300 మంది తొలగింపు

ఉద్యోగులకు వాషింగ్టన్ పోస్ట్ షాక్.. 300 మంది తొలగింపు
  • జాబ్ కోల్పోయిన వారిలో శశిథరూర్ కుమారుడు ఇషాన్
  • సంస్థ నిర్ణయంపై ఉద్యోగులు, యూనియన్  లీడర్ల ఫైర్

వాషింగ్టన్: ప్రముఖ అమెరికన్ దినపత్రిక వాషింగ్టన్  పోస్ట్  తన ఉద్యోగులకు షాక్  ఇచ్చింది. బుధవారం దాదాపు 300 మంది ఉద్యోగులను ఉన్నపళంగా తొలగించింది. మొత్తం సిబ్బందిలో మూడింట ఒక వంతు మందిని లేఆఫ్  చేసి షాక్  ఇచ్చింది. జాబ్  కోల్పోయిన వారిలో ఇండియన్ ఎంపీ శశిథరూర్  కుమారుడు ఇషాన్  థరూర్  కూడా ఉన్నారు. తొలగింపులు ఒక్క విభాగానికి మాత్రమే పరిమితం కాలేదు. ఎడిటోరియల్, ఇంటర్నేషనల్  రిపోర్టింగ్  స్టాఫ్,  మెట్రో కవరేజ్, ఎడిటింగ్  టీమ్స్, స్పోర్ట్స్  జర్నలిజం, కల్చరల్  కవరేజ్, బిజినెస్  డెస్క్  జర్నలిస్టులు సహా వివిధ విభాగాలకు చెందిన జర్నలిస్టులు ఉద్వాసనకు గురయ్యారు.

స్పోర్ట్స్  డెస్క్, పుస్తక సమీక్షలు చేసే బుక్  వరల్డ్  సెక్షన్  విభాగంలో మొత్తం సిబ్బంది ఖాళీ అయ్యారు. వివిధ దేశాల్లో ఇంటర్నేషనల్  రిపోర్టింగ్  చేస్తున్న పలువురు కూడా ఉద్యోగాలు కోల్పోయారు. పశ్చిమాసియా కరస్పాండెంట్, ఎడిటర్లందరినీ తొలగించారు. జెరుసలెం, ఉక్రెయిన్ లోనూ సంస్థ కార్యకలాపాలను బంద్  చేశారు. దీంతో జియోపొలిటికల్  రీజియన్లలో గ్రౌండ్  కవరేజీకి సంస్థ ముగింపు పలికింది. ఇంటర్నేషనల్  రిపోర్టర్ల ఉద్వాసనతో  వివిధ దేశాల్లో కొన్నేండ్ల తరబడి కొనసాగుతున్న సంస్థ కార్యకలాపాలు ఒక్కసారిగా బంద్  అయ్యాయి. కాగా.. తమను తొలగించాలన్న సంస్థ నిర్ణయంపై ఉద్యోగులు దిగ్ర్భాంతి వ్యక్తం  చేశారు. మీడియా వెటరన్లు, యూనియన్  లీడర్లు, రాజకీయ నేతలు, ప్రెస్  ఫ్రీడం అడ్వొకేట్లు.. వాషింగ్టన్  పోస్ట్  నిర్ణయంపై దుమ్మెత్తి పోశారు.

వ్యయాలు పెరగడంతోనే లేఆఫ్ లు: సంస్థ

వ్యయాలు పెరగడం వల్లే ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని వాషింగ్టన్  పోస్ట్  ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘ప్రింట్  రీడర్ షిప్  దారుణంగా పడిపోయింది. రీడర్ల ప్రవర్తనలో మార్పు వచ్చింది. డిజిటల్  రీడర్ షిప్  పరిస్థితి కూడా బాలేదు. దీంతో సంస్థకు ఆదాయం తగ్గిపోయింది. మరోవైపు ఖర్చులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో 
భవిష్యత్తులో సంస్థను బలోపేతం చేసేందుకు లేఆఫ్ లు అమలు చేశాం” అని సంస్థ పేర్కొంది.

నా ఉద్యోగం కూడా పోయింది: ఇషాన్  థరూర్

ఉద్వాసనకు గురైన 300 మంది ఉద్యోగుల్లో తాను కూడా ఉన్నానని ఇషాన్  థరూర్  ‘ఎక్స్’ లో తెలిపారు. ‘‘ఇన్నేండ్లు నా అద్భుతమైన కొలీగ్ లతో కలిసి పనిచేశాను. ఇక ఆ అవకాశం మాకు లేదు” అని ఆయన పేర్కొన్నారు. వాషింగ్టన్  పోస్ట్ లో ఇషాన్  సీనియర్  ఇంటర్నేషనల్  అఫైర్స్  కాలమిస్ట్ గా దశాబ్ద కాలంపైనే పనిచేశారు.