రేపు (ఫిబ్రవరి7న) ఉబర్, ఓలా, ర్యాపిడో బంద్..ముందే ప్రిపేర్ అవ్వండి..బంద్ ఎందుకో తెలుసుకోండి..!

రేపు (ఫిబ్రవరి7న) ఉబర్, ఓలా, ర్యాపిడో బంద్..ముందే ప్రిపేర్ అవ్వండి..బంద్ ఎందుకో తెలుసుకోండి..!

మరోకొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా ఓలా, ఉబర్‌, ర్యాపిడో సేవలు నిలిచిపోనున్నాయి. యాప్ ఆధారిత రైడ్ హెయిలింగ్ సేవల డ్రైవర్లు(గిగ్​ వర్కర్లు) శనివారం ఫిబ్రవరి 7న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మె ప్రభావంతో మెట్రో నగరాలే కాకుండా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

కనీస బేస్ ఛార్జీలు నిర్ణయించడం, న్యాయమైన ఛార్జ్ విధానం అమలు చేయడం వంటి డిమాండ్లతో గిగ్ వర్కర్లు చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు. ఛార్జీల విషయంలో తీవ్ర అసంతృప్తి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నియంత్రణ లేని పనివేళలు, ఎలాంటి సామాజిక భద్రత లేకపోవడం, ఆర్థిక భద్రత పూర్తిగా కొరవడటం వంటి సమస్యలతో డ్రైవర్లు సమ్మె బాట పట్టారు.

డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ఈ నిరసనల ప్రధాన లక్ష్యమని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) నేతలు తెలిపారు. ఈ సమ్మెను TGPWU ఇతర జాతీయ కార్మిక సంఘాల సహకారంతో నిర్వహిస్తోంది.

దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు ‘ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్’ పాటించనున్నట్లు యూనియన్ ప్రకటించింది. కనీస ఛార్జీలు లేకపోవడం, నియంత్రణ లేని పని విధానాలు, డ్రైవర్ల శ్రమను దోచుకునే విధానాల వల్ల లక్షలాది మంది డ్రైవర్లు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు అగ్రిగేటర్ సంస్థలు భారీ లాభాలు పొందుతుండగా, మరోవైపు డ్రైవర్లు పేదరికంలోకి జారిపోతున్నారని తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాసినట్లు TGPWU నేతలు వెల్లడించారు. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.