HONEY Review: ‘హనీ’ రివ్యూ.. నవీన్ చంద్ర హార్రర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

HONEY Review: ‘హనీ’ రివ్యూ.. నవీన్ చంద్ర హార్రర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ (HONEY). పలాస మూవీ డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ (ఫిబ్రవరి 6, 2026న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. దివ్య పిళ్లై, బిగ్‌బాస్ ఫేమ్ దివి, రాజా రవీంద్ర ఇతర పాత్రల్లో నటించిన ఈ మూవీపై, థ్రిల్లర్ ప్రియుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సమాజంలోని చీకటి కోణాలను, మూఢనమ్మకాలు మరియు అంధ విశ్వాసాల వెనుక దాగి ఉన్న భయానక నిజాలను ఆవిష్కరించే ప్రయత్నమే ఈ సినిమా. టీజర్, ట్రైలర్ ద్వారా ప్రేక్షకుల్లో భారీ ఇంపాక్ట్ తీసుకొచ్చిన "హనీ".. థియేటర్లలో భయపెట్టిందా? పలాస 1978’ గుర్తింపు తెచ్చుకున్న కరుణకుమార్‌ ‘హనీ’తో ఎలాంటి ప్రయోగం చేశాడు? అనేది పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. 

హనీ కథగా..

ఆనంద్ (నవీన్ చంద్ర) ఓ మిడిల్ క్లాస్ మ్యాన్. కోట్లు సంపాదించాలనే అత్యాశతో మూఢ నమ్మకాలు, క్షుద్ర పూజల వైపు ఆకర్షితుడవుతాడు. దీంతో ఉన్న ఉద్యోగం పోతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య లలిత (దివ్య పిళ్లై) టీచర్‌‌గా పనిచేస్తూ ఫ్యామిలీని పోషిస్తుంటుంది. కూతురు మీరా (బేబీ జయన్నీ) అశుభ గడియల్లో పుట్టిందని ఈసడించుకుంటాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు సారంగపాణి (రాజా రవీంద్ర)తో కలిసి క్షుద్ర ప్రయోగాలు చేస్తుంటాడు.

అందుకు ఓ చిన్నారి అవసరం. తన కూతురునే ఫణంగా పెడతాడు ఆనంద్. ఓ క్షుద్ర ప్రయోగం ఫలించి డబ్బు రావడంతో కూతురు ఆరోగ్యం క్షీణిస్తున్నా డబ్బుపై ఆశతో అదేదారిలో ముందుకెళ్తుంటాడు. ఇందుకోసం భార్యను గదిలో బంధించి అనారోగ్యం పాలు చేస్తాడు. అతని క్షుద్ర ప్రయోగాల కారణంగా ‘హనీ’ అనే అదృశ్య శక్తితో మీరా మాట్లాడుతుంటుంది.

అసలు ఆ హనీ ఎవరు..? ఆనంద్ క్షుద్ర పూజలు ఆ కుటుంబాన్ని ఏం చేశాయి..? అతని పిచ్చి నమ్మకాలతో తల్లి, కూతురు ఎలాంటి నరకంగా అనుభవించారు..? అతని చెర నుంచి ఎలా బయటపడ్డారు..? ఇందులో రమణ (దివి) పాత్ర ఏమిటి.. అనేది అసలు కథ.

ఎలా ఉందంటే... 

మూఢ నమ్మకాలు, క్షుద్ర ఆరాధనలు మనిషిని ఎంతలా దిగజారుస్తాయి.. తనను, తనను నమ్ముకున్న కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తాయి అనేది ప్రధానంగా ఈ చిత్రం ద్వారా చెప్పదలచుకున్నారు. మదనపల్లిలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్‌ స్ఫూర్తితో దర్శకుడు కరుణ్ కుమార్ ఈ కథ రాసుకున్నారు. ఇందుకు దేవాంగ పిల్లులను బలి ఇస్తే అద్భుత శక్తులు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయనే మూఢ నమ్మకం నేపథ్యంలో ఈ కథను నడిపించారు. ఈ మూఢ నమ్మకం వెనకున్న ప్రతి చిన్న అంశాన్ని డీటైయిల్డ్‌గా చెప్పే ప్రయత్నం చేశారు.

►ALSO READ | పవన్–సురేందర్ రెడ్డి మూవీ అప్‌డేట్: పవర్ స్టార్ సరసన ఆ ‘క్రేజీ’ బ్యూటీ?.. మార్చిలో షూటింగ్..!

అయితే ఈ తరహా సినిమాల్లో ఉండాల్సిన  సస్పెన్స్, స్పీడు ఇందులో లోపించాయి. ఆనంద్ దేనికోసం ఇదంతా చేస్తున్నాడు అనేది సెకండాఫ్‌ వరకు రివీల్ కాకపోవడం, స్లో నెరేషన్ ప్రేక్షకులను కొంత ఇబ్బంది పెడుతుంది. అసలు విషయం రివీల్ చేశాక కథలో వేగం పుంజుకుంది. ఇప్పటివరకూ సినిమాల్లో అంతగా స్పృశించని పిల్లులను బలి ఇవ్వడం అనే మూఢ నమ్మకం నేపథ్యం కావడంతో సినిమాపై ఆసక్తి కలుగుతుంది.

క్షుద్ర పూజలు, దెయ్యాలపై వచ్చిన గత చిత్రాలకు భిన్నమైన సినిమా ఇది. ఆశ్చర్యపోయే అంశాలు, ఆలోచింపజేసేవి తప్ప భయపెట్టేవేమీ సినిమాలో అంతగా లేవు. అత్యాశ, మూఢ నమ్మకాలను మించి మనిషిని పీడించే పెద్ద దెయ్యం మరొకటి ఉండదని దర్శకుడు ఈ చిత్రంతో చెప్పే ప్రయత్నం చేశారు.

నటీనటుల నటన :

నవీన్ చంద్ర హారర్ టోన్‌కు తగ్గ సీరియస్ లుక్‌లో కనిపించి భయపెట్టాడు. నిరుద్యోగిగా మొదలై, పిచ్చి నమ్మకాలతో వింతగా ప్రవర్తించే సైకోగా మారే సీన్స్ లో జీవించేసాడు. రాజా రవీంద్ర, దివి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. నవీన్ భార్య పాత్రలో నటించిన దివ్య పిళ్లై, కూతురు మీరా పాత్రలో బేబీ జయన్ని ఇంపాక్ట్ చూపించారు. 

టెక్నీకల్ టీమ్:

అజయ్ అరసాడ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. భయంకరమైన BGMతో వెన్నులో వణుకుపుట్టించాడు. గగుర్పాటు కలిగించే విజువల్స్ కు, తనదైన బిజియమ్స్ ఇచ్చి సినిమాకు ప్రాణం పోశారు. ఓవా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. యదార్థ ఘటనలతో కూడిన హారర్ థ్రిల్లర్ని తెరకెక్కించిన కరుణ కుమార్ ప్రయోగం బాగుంది. కొన్నిచోట్ల స్లో నెరేషన్స్ తప్ప, థ్రిల్లర్ సీన్స్తో అవి కనిపించకుండా చేశాడు.