మహారాష్ట్ర: గడ్చిరోలి జిల్లాలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ భీకర ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు.
ఎన్‌కౌంటర్‌లో కామారెడ్డికి చెందిన మావోయిస్టు కీలక నేత ప్రభాకర్ మృతి చెందాడు. మహారాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టు ప్రభాకర్‌పై రూ.50 లక్షల రివార్డు ప్రకటించి ఉంది. ప్రభాకర్ గడ్చిరోలి డివిజనల్ కమిటీ హెడ్గా ఉన్నాడు. ఈ ఎదురుకాల్పుల్లో ఒక పోలీసు కూడా అమరుడయ్యాడు. మరొకరికి గాయాలయ్యాయి.
►ALSO READ | తమిళనాడులో బర్డ్ ఫ్లూ కలకలం..వందలాది కాకులు చనిపోయాయి..H5N1 వైరస్ డేంజర్ బెల్స్
గడ్చిరోలికి, ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతానికి సమీపంలోని భమ్రాగడ్ తాలూకాలోని ఫోదేవాడ గ్రామం దగ్గర అడవిలో పోలీసులు, నక్సలైట్ల మధ్య మూడు రోజులుగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ ఎన్ కౌంటర్లో ఏడుగురు మావోలతో పాటు జవాన్ దీపక్ మాదవి అమరుడయ్యాడు. జవాన్ జోగా మాదవి గాయపడ్డాడు.
ఫిబ్రవరి 3న సాయంత్రం C-60 స్క్వాడ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, రాపిడ్ రెస్పాన్స్ టీం సిబ్బంది.. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ మొదలుపెట్టారు. అప్పటి నుంచి పోలీసులకు, నక్సలైట్లకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. పోలీసులు 3 AK 47లు, ఒక SLR రైఫిల్, ఒక 303 గన్ను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నక్సలైట్లను గుర్తించే పనిలో ఉన్నారు.
