చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. వందల సంఖ్యలో కాకులు అకస్మాత్తుగా మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తోంది. మృతిచెందిన కాకుల కళేబరాలను ల్యాబ్‌కు పంపించి పరీక్షించగా, వాటికి బర్డ్ ఫ్లూ సోకినట్టు అధికారులు నిర్ధారించారు. ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైన H5N1 వైరస్ ఉన్నట్లు గుర్తించడంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
శుక్రవారం (ఫిబ్రవరి 7) చెన్నై పరిసర ప్రాంతాల్లో సుమారు 1,500 కాకులు, కోళ్లు బర్డ్ ఫ్లూతో మృతి చెందాయి. దీంతో H5N1 వైరస్ మళ్లీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మృతిచెందిన పక్షుల కళేబరాలను దహనం చేయడం లేదా పూడ్చిపెట్టాలని అధికారులు ఆదేశించారు. అలాగే ప్రజలు పక్షులకు దూరంగా ఉండాలని, అనవసరంగా వాటిని తాకవద్దని హెచ్చరించారు.
బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి?
వైద్యపరంగా ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాగా పిలువబడే బర్డ్ ఫ్లూ ఒక వైరల్ ఇన్ ఫెక్షన్. ఇది ప్రధానంగా పక్షులకు సోకుతుంది. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ వైరస్ పక్షుల నుంచి మనుషులకు కూడా సంక్రమించే ప్రమాదం ఉంటుంది. కోళ్లు, బాతులు, అడవి నీటి పక్షుల్లో ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది.
ఎవరికీ ఎక్కువ ప్రమాదం?
కోళ్ల ఫారాల్లో పనిచేసేవారు, వ్యవసాయ పనులు చేసే వారు, బర్డ్ ఫ్లూ సోకిన పక్షులకు లేదా కోళ్లకు దగ్గరగా ఉండే వ్యక్తులకు ఈ వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
బర్డ్ ఫ్లూ లక్షణాలు:
బర్డ్ ఫ్లూ సోకిన వ్యక్తుల్లో జ్వరం,దగ్గు,గొంతు నొప్పి,అలసట,శరీర నొప్పులు,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. బర్డ్ ఫ్లూ అని నిర్ధారణ అయితే ఆలస్యం చేయకుండా సరైన చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
అధికారులు ఇప్పటికే బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలను పాటించాలని కోరుతున్నారు.
