
- భూ సమస్యలపై త్వరలో అఖిలపక్ష భేటీ
- అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చిస్తం: సీఎం రేవంత్
- ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీస్కుంటం
- భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: భూ సమస్యలపై త్వరలో అఖిలపక్ష భేటీ ఏర్పాటుచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అవసరమైతే అసెంబ్లీలో చర్చించి ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాకే సమగ్ర భూచట్టం తీసుకొస్తామని చెప్పారు. సెక్రటేరియెట్లో ధరణి సమస్యలపై శుక్రవారం ఆయన రివ్యూ నిర్వహించి మాట్లాడారు. ధరణి కారణంగా తలెత్తుతున్న సమస్యల శాశ్వత పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. భూ సమస్యలు నానాటికీ పెరిగిపోతున్నాయని తెలిపారు. సమగ్ర భూ చట్టం రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ఒకప్పుడు గ్రామ స్థాయిలోనే రికార్డులు అందుబాటులో ఉండేవి. చట్టాల్లో వచ్చిన మార్పుల కారణగా క్రమంగా మండల కేంద్రానికి.. తర్వాత జిల్లా కేంద్రానికి.. ఆ తర్వాత రాష్ట్ర స్థాయికి వెళ్లిపోయినయ్. గతంలో భూ సమస్యల పరిష్కారానికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉండేది. ధరణితో గ్రామ, మండల స్థాయిలో ఏ సమస్యకు పరిష్కారం లేకుండా పోయింది. అధికారాలన్నీ కలెక్టర్కు అప్పజెప్పారు. అక్కడ కూడా సమస్య పరిష్కారం కావడం లేదు. కలెక్టర్లు తీసుకునే ఏ నిర్ణయాన్ని ప్రశ్నించే అవకాశం లేకుండా ధరణిని రూపొందించారు. ఈ నేపథ్యంలో భూదాన్, పోరంబోకు, బంచరాయి, ఇనాం, కాందిశీకుల భూముల సమస్యలున్న ఓ మండలాన్ని ఎంపిక చేసుకొని, అక్కడ ఎదురవుతున్న సమస్యలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందిస్తాం. అప్పుడే పూర్తి స్పష్టత వస్తది’’అని అన్నారు. భూములకు సంబంధించిన అన్ని సమస్యలపై అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
పెండింగ్ అప్లికేషన్లు వెంటనే పరిష్కరించండి
ధరణి పోర్టల్లో పెండింగ్ అప్లికేషన్లపైనా సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మొత్తం 3,49,514 అప్లికేషన్లు ధరణిలో ఉండగా.. అందులో 1.80 లక్షల అప్లికేషన్లు పరిష్కరించినట్లు అధికారులు వివరించారు. మిగతా వాటిని కూడా వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. ధరణి పోర్టల్లో ఉన్న మాడ్యూల్స్ విషయంలోనూ ఇంకా యూజర్ ఫ్రెండ్లీ ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవ రావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, సీఎస్ శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, మాజీ మంత్రి జానారెడ్డి, ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి, సునీల్ కుమార్, రేమండ్ పీటర్, మధుసూదన్ అధికారులు పాల్గొన్నారు.