అర్హులైన ఏ ఒక్క ఓటర్ పేరు కూడా తొలగించం: సీఈసీ జ్ఞానేష్ కుమార్

అర్హులైన ఏ ఒక్క ఓటర్ పేరు కూడా తొలగించం: సీఈసీ జ్ఞానేష్ కుమార్

కోల్‎కతా: ఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఏ ఒక్క ఓటర్ పేరు కూడా తొలగించబోమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. మరికొన్ని రోజుల్లో పశ్చిమ బెంగాల్‎లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు సీఈసీ రెండు రోజులుగా బెంగాల్‎లో పర్యటించారు. 

రాజకీయ పార్టీలు, అధికారులతో వరుస సమావేశాలు  నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం (మార్చి 10) కోల్‎కతాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో స్వేచ్ఛగా, న్యాయంగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూసుకోవడమే ఎన్నికల కమిషన్ ప్రాధాన్యత అని చెప్పారు. 

పశ్చిమ బెంగాల్ ప్రజలు ఎల్లప్పుడూ శాంతియుత, భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తారన్నారు. బెంగాల్ ఎన్నికల ప్రక్రియలో అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు ఈసీ సూచనల ప్రకారం పనిచేయాల్సి ఉంటుందని.. ఎన్నికల విధుల్లో ఎటువంటి అలసత్వాన్ని సహించబోమని హెచ్చరించారు. అర్హత ఉన్న ప్రతి ఓటరుకు తమ ఓటు వేసే అవకాశం ఉంటుందని చెప్పారు. 

పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 80 వేల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో దాదాపు 61 వేలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపారు. ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలింగ్ బూత్‌లలో ఎన్నికల సంఘం 100 శాతం వెబ్‌కాస్టింగ్‌ను అమలు చేస్తుందని వెల్లడించారు. 

బెంగాల్‎లో రాజ్యాంగం ప్రకారం ఓటర్ జాబితాల ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ జరిగిందని.. ఇది పూర్తిగా న్యాయబద్ధమైనదని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఢిల్లీకి తిరిగి వెళ్లి బెంగాల్ ఎన్నికలు, ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహిస్తుందని తెలిపారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించేందుకు బెంగాల్‎లో పర్యటించిన సీఈసీ జ్ఞానేష్ కుమార్‎కు నిరసన సెగ ఎదురైంది. బెంగాల్‎లో సర్‎ను వ్యతిరేకిస్తూ జ్ఞానేష్ కుమార్ గో బ్యాక్ అంటూ కొందరు నిరసన తెలిపారు.