E20 పెట్రోల్ పోస్టులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోర్టుకెక్కారు. E20 పెట్రోల్ తో తన కుటుంబం లాభపడుతుందని సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా తనకు పరువు నష్టం కలిగించేలా ప్రచారం జరుగుతోందని ముంబై హైకోర్టును ఆశ్రయించారు నితిన్ గడ్కరీ. సోమవారం (జూలై27) గడ్కరీ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. మెటా , గూగుల్ తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలపై గడ్కరీ పరువు నష్టం దావా వేసుకోవచ్చిని అనుమతిచ్చింది.
గడ్కరీ తరఫు న్యాయవాది వాదిస్తూ, ఈ పరువు నష్టం కలిగించే కంటెంట్ ముంబైలో కూడా అందుబాటులో ఉండటంతో హైకోర్టుకు ఈ కేసును విచారించే అధికారం ఉందని తెలిపారు. దీనిని అంగీకరించిన కోర్టు దావా దాఖలు చేసేందుకు అనుమతి మంజూరు చేసింది.
E20 పెట్రోల్ కు వ్యక్తిగతంగా బాధ్యుడని ఇథనాల్ మిశ్రమం ద్వారా తన కుటుంబం లాభపడిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని గడ్కరీ ఆరోపించారు. తన పేరు, ఫోటో, గొంతును AI సాయంతో మార్చి డీప్‌ఫేక్ కంటెంట్ తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని గడ్కరీ లాయర్ కోర్టుకు తెలిపారు. ఇవన్నీ అసత్యాలు, గడ్కరీ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నమని వాదించారు. అయితే ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన విమర్శలకు తాను వ్యతిరేకం కాదని, కానీ తప్పుడు ఆరోపణలు, డీప్‌ఫేక్ ప్రచారంపై మాత్రమే చర్యలు కోరుతున్నానని గడ్కరీ స్పష్టం చేశారు.
ALSO READ : E20 జనతా పార్టీ పేరుతో మరో ఉద్యమం
ఏంటీ E20 పెట్రోల్ ?..
E20 అనేది 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్‌తో తయారయ్యే ఇంధన మిశ్రమం. ముడి చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని తగ్గించడం, దేశీయ జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే పాత వాహనాలపై E20 ప్రభావంపై కొంతమంది వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
