ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆఫీసర్లకు సూచించారు. సోమవారం నగర పాలక సంస్థ 43వ డివిజన్‌లో రూ.61.50 లక్షల సుడా నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ నిధులను పారదర్శకంగా వినియోగించి ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్నారు. ఖమ్మం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పలు కీలక ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని తెలిపారు.
అనంతరం అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పనులను పరిశీలించిన మంత్రి, నగరంలో వరద ముంపు నివారణకు రూ.100 కోట్లతో పైప్‌లైన్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే రూ.200 కోట్ల అమృత్ పథకం ద్వారా రక్షిత తాగునీటి సరఫరా చేపడుతున్నామని తెలిపారు. ఖమ్మం నగరానికి వరద ముంపు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి సహకారం అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
