- పాతాళానికి పడిపోతున్న భూగర్భ జలాలు
- ఎండిపోతున్న బావులు, బోర్లు
- తాగునీటి సరఫరాపై
- తీవ్ర ప్రతికూల ప్రభావం
- రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నతాధికారుల నివేదిక
- ఫస్ట్ ప్రయారిటీ తాగునీటికే
- కంటింజెన్సీ ప్లాన్ కింద
- 39 లక్షల ఎకరాల సాగు తప్పనిసరి అని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9 వేల గ్రామాలపై ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉందని వ్యవసాయ, ఇరిగేషన్, ఇతర శాఖల ఉన్నతాధికారులు రూపొందించిన సమగ్ర నివేదిక స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్‌చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా సాధారణ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని, అందువల్ల పంటల సాగు నిర్వహణతో పాటు ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సమగ్ర ప్రణాళికలు రూపొందించడం అత్యంత ఆవశ్యకమని నివేదిక వెల్లడింది.
వ్యవసాయం, ఇరిగేషన్, విద్యుత్ ఈ మూడు శాఖలు తీవ్రంగా ప్రభావిమవుతాయని.. ఫలితంగా వీటితో ముడిపడి ఉన్న రంగాలన్నీ ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇందుకోసం వ్యవసాయ శాఖ దాదాపు 39 లక్షల ఎకరాల విస్తీర్ణానికి సరిపడేలా అత్యవసర ‘కంటింజెన్సీ ప్లాన్’ను పక్కాగా అమలు చేయాలని సూచించింది.
కేవలం వ్యవసాయరంగానికే పరిమితం కాకుండా తాగునీటి ఎద్దడిని నివారించేందుకు పంచాయతీ రాజ్, మున్సిపల్ పరిపాలన శాఖలు మిషన్ భగీరథ, నీటిపారుదల శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని పేర్కొంది. రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల వద్ద నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అన్ని జలాశయాల వద్ద ముందస్తు అలర్ట్ ప్రకటించి, అత్యవసర పరిస్థితుల్లో తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. జల విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
26 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం..
ఎల్నినో కారణంగా రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 26 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి ఖమ్మం, ఆసిఫాబాద్, వనపర్తి, మహబూబాబాద్, జనగామ, హనుమకొండ, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాలపై ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 892 గ్రామాలు తీవ్ర ప్రభావానికి(వల్నరబుల్) గురయ్యే అవకాశం ఉండగా.. 7,939 గ్రామాలు మోస్తరు ప్రభావానికి గురవుతాయని గుర్తించారు.
మొత్తంగా 9 వేల గ్రామాలు ఎల్ నినో ఒత్తిడికి లోనయ్యే పరిస్థితులు కనిపిస్తుండడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టడం అనివార్యంగా మారింది. ముఖ్యంగా భూగర్భ జలాలు సైతం గతేడాదితో పోలిస్తే గణనీయంగా పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోందని తాజా నివేదిక స్పష్టంచేసింది.
‘జులై నెల ముగింపు నాటికి రాష్ట్రవ్యాప్తంగా సగటు భూగర్భ జలమట్టం లోతు పెరిగిపోవడంతో బావులు, బోర్లు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పంటలకే కాకుండా, తాగునీటిపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం పడే సూచనలు స్పష్టమవుతున్నాయి’ అని అధికారులు తమ నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రత్యామ్నాయంగా పెసర్లు, మినుములు, కంది, జొన్న, సజ్జలు..
తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ సాగు పద్ధతులను ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ సుమారు 39 లక్షల ఎకరాల విస్తీర్ణంలో అత్యవసర కంటింజెన్సీ ప్లాన్ అమలుకు శ్రీకారం చుట్టింది. సాధారణంగా వానాకాలం సీజన్‌లో 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా.. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల వల్ల సాధారణ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతుందని అంచనా వేశారు.
నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరి సాగును బోరు బావుల కింద, వర్షాభావ ప్రాంతాల్లో తగ్గించుకోవాలని, దానికి బదులుగా స్వల్పకాలిక రకాలు, ప్రత్యామ్నాయ పంటలైన పెసర్లు, మినుములు, కంది, జొన్న, సజ్జలు, పొద్దుతిరుగుడు, నువ్వులు, వర్షాభావ తీవ్రతను తట్టుకునే నూనెగింజలు, వేరుశనగ, తోటకూరలు, కూరగాయల సాగు వైపు రైతులను మళ్లించాలని ప్రతిపాదించారు.
ఎస్సారెస్పీలో 22.19 టీఎంసీలు తగ్గినయ్
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలోని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గినట్టు నివేదిక పేర్కొంది. గతేడాది జులై 25 నాటికి శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరామ్‌సాగర్, మిడ్ మానేరు, సింగూరు, జూరాల వంటి అన్ని ప్రధాన ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం తక్కువగా నమోదైంది.
ఎస్సారెస్పీలో గత సంవత్సరం ఇదే సమయానికి 43.76 టీఎంసీల నీరు ఉండగా, ప్రస్తుతం 21.57 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. నాగార్జునసాగర్‌లో 126.96 టీఎంసీలకు గాను 123.63 టీఎంసీలు, శ్రీశైలంలో 34.71 టీఎంసీల నుంచి 33.37 టీఎంసీలకు నీటి మట్టాలు పడిపోయాయి. మిడ్ మానేరు, లోయర్ మానేరు, కడెం ప్రాజెక్టుల్లో కూడా గతేడాదితో పోలిస్తే నీటి నిల్వలు బాగా తగ్గాయి.
తాగునీటికి సమన్వయం
పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, మున్సిపల్ పరిపాలన శాఖలు ఇరిగేషన్ శాఖతో నిరంతరం సమన్వయం చేసుకొని పని చేయాలని అధికారులు సూచించారు. తాగునీటి ఎద్దడి తలెత్తే గ్రామాల్లో ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించడం, బోర్ల పునరుద్ధరణ, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
కృష్ణా, గోదావరి బేసిన్ పరిధిలోని ప్రధాన మధ్యతరహా ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు లెక్కిస్తూ, ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిలో మొదటి ప్రాధాన్యతను తాగునీటి అవసరాలకే కేటాయించాలని చెప్పారు. తాగునీటి పథకాలకు అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని, మిషన్ భగీరథ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. మరీ ముఖ్యంగా తాగునీటి నిర్వహణకు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని నివేదిక స్పష్టంచేసింది.
