కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తిరుమల విద్యాసంస్థల అధినేత నున్న సురేష్ మృతి చెందారు. మంగళవారం ( జులై 28 ) బాపులపాడు మండలం బొమలూరు ( కల్లపరు ) టోల్ గేట్ సమీపంలోని హైవేపై జరిగింది ఈ ప్రమాదం. నున్న సురేష్ ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారు వేగంగా వచ్చి రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
సురేష్, నున్న విమల దేవితో కలిసి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి కారులో వెళుతుండగా.. బొమ్మలూరు టోల్ గేట్ దగ్గరికి చేరేరుకున్న సమయంలో ముందు ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందుభాగం నుజ్జు నుజ్జయ్యింది. ఈ ఘటనలో సురేష్ అక్కడికక్కడే మృతి చెందగా నున్న విమల దేవికి తీవ్ర గాయాలయ్యాయి.
విమల దేవిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
