కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీని కించపరిచేలా అభ్యంతరకర క్యారికేచర్లను ప్రదర్శించిన వ్యవహారంలో బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోల్‌కతాలోని ఆనంద్‌పూర్ పీఎస్లో ఆదివారం బీజేపీ నేత కయా ఘోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. జులై 24న సీల్దా నుంచి ధర్మతల వరకు జరిగిన బహిరంగ ర్యాలీలో నటి శ్రీలేఖ మిత్ర పాల్గొని, ప్రధాని మోదీని అవమానించేలా ఉన్న పోస్టర్లను ప్రదర్శించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ వివాదంపై శ్రీలేఖ స్పందిస్తూ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. తాను కావాలని ఆ పోస్టర్ పట్టుకోలేదని చెప్పుకొచ్చారు. తాను బీజేపీ వ్యతిరేకే కావచ్చు కానీ కావాలని ఇలాంటి పనులు చేసే దేశద్రోహిని కాదంటూ శ్రీలేఖ తన వాదన వినిపించారు.
