వాళ్లేమి టెర్రరిస్టులు కారు.. డ్రగ్స్ సరఫరా చేస్తున్న కింగ్ పిన్స్ కాదు.. పసిపిల్లలను రేప్ చేసిన క్రిమినల్స్ అంతకన్నా కాదు.. స్టూడెంట్స్.. తమకు జరిగిన అన్యాయాన్ని నిరసనలతో వ్యక్తం చేస్తున్న భావిభారత పౌరులు.. దేశ భవిష్యత్తును నిర్ణయించే యువకులు... మరి వీళ్ళపై AK47 గన్స్ తో కాల్పులా? నీట్ ఎగ్జామ్ పేపర్ లీకులకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న జెడ్ జెడ్ యువతపై AK 47 గన్ తో కాల్పులు జరిపిన వీడియో వైరల్ కావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది. కాల్పులు జరిపిన పోలీసును సస్పెండ్ చేశారు.
వీడియోలో నీలి రంగు హెల్మెట్,బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ ధరించిన అభిషేక్ పటేల్ అనే పోలీస్ అధికారి నిరసనకారుల వైపు దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది. అభిషేక్ పటేల్ తన తోటి పోలీసులను అనుసరించమని చెప్పి తూటా పేలుస్తూ ముందుకు వెళ్లినట్టు వీడియోలో రికార్డయింది. ఆ తర్వాత పోలీసులు ఏదో విసురుతున్నట్లు కూడా కనిపించింది.
రాష్ట్రవ్యాప్త బంద్ సందర్భంగా పలు జిల్లాల్లో విద్యార్థి సంఘాలు భారీ ప్రదర్శనలు నిర్వహించాయి. ఈ సందర్భంగా పలుచోట్ల నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. భద్రతా సిబ్బందిపై రాళ్ల దాడి ఘటనలు కూడా జరిగాయి. అదుపు తప్పిన గుంపులను చెదరగొట్టడానికి నిరసన కారులపై పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లను ఉపయోగించారు.
ఇదిలా ఉండగా సివాన్‌లో కాల్పుల్లో గాయపడిన ముగ్గురు నిరసనకారులు పాట్నాలోని జయప్రభ మెదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది. ఓ స్థానికుడు బంద్ సమయంలో దుకాణం మూసివేసి ఇంటికి తిరిగి వస్తుండగా అతని మెడకు బుల్లెట్ తగిలిందని అధికారులు తెలిపారు.
ALSO READ : ఒక్క వర్షానికే కొట్టుకుపోయిన 4 వేల కోట్ల రోడ్డు..
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ విషయాన్ని లేవనెత్తి, ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్ లు, బీహార్‌లో ఏకే-47లను వినియోగించారని నిరసనలు తెలిపిన ప్రతీ చోటా ఇదే తీరు కనిపిస్తోందని ఆందోళన్య వ్యక్తం చేశారు.
