లక్నో: బీజేపీ ప్రభుత్వ డొల్లతనం మరోసారి బయటపడింది. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన జాతీయ రహదారి కేవలం ప్రారంభించిన 12 రోజులకే కుంగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నేషనల్ హైవే సరిగ్గా రెండు వారాలు కాకముందే డ్యామేజ్ కావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలేం జరిగిందంటే..?
సుమారు రూ. 4,200 నుంచి రూ. 4,700 కోట్ల వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో లఖ్‌నవూ-కాన్పూర్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు. 63 కిలోమీటర్ల పొడవు, 6-లేన్లతో నిర్మించిన ఈ హైవేను 2026, జులై 13న కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారికంగా ప్రారంభించారు. అయితే, ప్రారంభించిన 12 రోజులకే ఒకే ఒక్క వర్షానికి లఖ్‌నవూ-కాన్పూర్ హైవే కుంగిపోయింది.
ఉన్నావ్ జిల్లాలోని కొరారీ సమీపంలో కాన్పూర్-లఖ్‌నవూ క్యారేజ్‌వేపై సుమారు 5 నుంచి 7 మీటర్ల మేర రహదారి కుంగిపోయింది. కోట్లకు కోట్లు పెట్టిన నిర్మించిన నేషనల్ హైవే నిండా నెల తిరగకముందే కుంగిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లఖ్‌నవూ-కాన్పూర్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే కుంగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఈ ఘటనపై ప్రతిపక్షాలు, సామాన్య ప్రజలు, నెటిజన్లు మండిపడుతున్నారు. వేల కోట్లతో నిర్మించిన రోడ్డు 12 రోజుల్లోనే కుంగిపోవడం ఏంటని రోడ్డు నాణ్యతపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే, భారీ వర్షాల కారణంగా రహదారి కింద ఉన్న మట్టి కొట్టుకుపోవడంతో హైవే కుంగిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండటంతో హుటాహుటిన అధికారులు మరమ్మత్తు పనులు చేపట్టారు.
