వాషింగ్టన్: ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరగుతున్నాయని.. ఈ సారి చర్చలు విఫలమైతే మాత్రం ఇరాన్‌పై భీకర సైనిక దాడి చేస్తామని హెచ్చరించారు. బాంబుల వర్షం కురిపించి ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బ తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా-ఇరాన్ మధ్య 13 రోజుల పాటు జరిగిన పరస్పర దాడులకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే.
క్షిపణి నిల్వలు తగ్గుతుండటం, దౌత్య చర్చలు ఊపందుకోవడంతో దాడులను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ క్రమంలో ట్రంప్ ఆక్సియోస్ మీడియాతో మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో శాంతి కోసం ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. త్వరలోనే ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న చర్చలు విఫలమైతే మాత్రం ఇరాన్‌పై భీకరమైన సైనిక చర్య పునఃప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
చర్చల కోసం ఇరాన్‌కు మరో అవకాశం ఇచ్చేందుకు దాడులను తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. తమ మిత్రపక్షాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే, చర్చలకు ఎక్కువ సమయం లేదని.. వీలైనంత త్వరగా ఏదో ఒకటి తేలిపోవాలన్నారు. ఇరాన్‌ను ఇప్పటికే అన్ని రకాలుగా దెబ్బ తీశామని.. అందుకే ఆ దేశం మాతో ఒప్పందం కోసం ప్రయత్నిస్తోందని ప్రగల్భాలు పలికారు.
ఇరాక్‌లోని అమెరికా కాన్సులేట్ లక్ష్యంగా దాడులు:
అమెరికా ఇరాన్‌పై సైనిక చర్యను నిలిపివేసి.. చర్చల కోసం ప్రయత్నాలు చేస్తోన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. మంగళవారం (జులై 28) తెల్లవారుజామున ఉత్తర ఇరాక్‌లోని ఎర్బిల్‌లో ఉన్న అమెరికా కాన్సులేట్ సమీపంలో పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రాంతంలోని పలు ప్రదేశాలను ఇరాన్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి. డ్రోన్ అటాక్స్‌తో ఆ ప్రదేశంలో భారీగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. శాంతి కోసం దౌత్య చర్చలు జరుగుతోన్న వేళ ఇరాన్ దాడులు చేయడంతో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై అమెరికా ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి మరీ.
