ఏటీసీల్లో పాసైతే 99 శాతం మందికి జాబ్స్.. రూ.25 నుంచి 30 లక్షల జీతం

ఏటీసీల్లో పాసైతే 99 శాతం మందికి జాబ్స్.. రూ.25 నుంచి 30 లక్షల జీతం

హైదరాబాద్: తెలంగాణలో విద్యార్థులకు మెరుగైన నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు, వారికి అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ అన్నారు. ఏటీసీలు (అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు), పాలిటెక్నిక్ కళాశాలల అప్‌గ్రేడ్‌పై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణకు మాత్రమే 4 పీఎం సేతు క్లస్టర్లు

దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక్కో క్లస్టర్ వచ్చినప్పటికీ.. పీఎం సేతు పథకం కింద తెలంగాణకు నాలుగు క్లస్టర్లు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇచ్చేందుకు ఏటీసీలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.మల్లేపల్లిలో ఏటీసీని అత్యాధునిక సౌకర్యాలతో అద్భుతంగా తీర్చిదిద్దామని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఏటీసీలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

ఏటీసీల్లో శిక్షణ.. ప్రతి నెల రూ.2 వేల స్టైఫండ్

ఏటీసీల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ప్రతి నెల రూ.2 వేల స్టైఫండ్ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఏటీసీల్లో శిక్షణ పూర్తి చేసిన వారిలో 99 శాతం మందికి ఉద్యోగాలు లభించాయని చెప్పారు.

యువతకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వార్షిక వేతనాలతో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. జపాన్, జర్మనీ తదితర దేశాల్లో కూడా తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

ఏజెంట్ల అవసరం లేకుండా ఉద్యోగ అవకాశాలు

విదేశీ ఉద్యోగాల కోసం యువత ఏజెంట్లను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం టామ్‌కామ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని మంత్రి వివేక్ తెలిపారు. టామ్‌కామ్ సంస్థ ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు అందిస్తున్నామని చెప్పారు.అలాగే జపాన్‌లోని హిరోషిమా యూనివర్సిటీతో వొకేషనల్ ట్రైనింగ్, విద్యార్థుల ఎక్స్‌చేంజ్ కార్యక్రమాల కోసం ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.

రూ.4 వేల కోట్లతో ఏటీసీల అభివృద్ధి

ఏటీసీల అభివృద్ధి కోసం సుమారు రూ.4 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలను సుమారు రూ.8 వేల కోట్లతో అప్‌గ్రేడ్ చేయనున్నట్లు చెప్పారు.పాలిటెక్నిక్ విద్యపై విద్యార్థులు, లెక్చరర్లలో కొన్ని అపోహలు ఉన్నాయని.. వాటిని తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

ప్రస్తుతం ఉన్న కోర్సులు కొనసాగుతాయి

కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం వల్ల తమ పరిస్థితి ఏమవుతుందోనని కొందరు అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారని మంత్రి తెలిపారు. అయితే ప్రస్తుతం ఉన్న కోర్సులను తొలగించబోమని, వాటితో పాటు అవసరమైన కొత్త కోర్సులను మాత్రమే చేర్చుతామని స్పష్టం చేశారు.

విద్యార్థులు, లెక్చరర్లు ఎలాంటి అపోహలకు గురికావద్దని సూచించారు. జీఓ 97లో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎలాంటి ఫీజుల పెంపు ఉండదని స్పష్టం చేశారు.

పాలిటెక్నిక్‌ల ప్రైవేటీకరణ ఉండదు

పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. ప్రభుత్వం భూములు విక్రయిస్తోందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఐటీఐలకు ఒక్క పైసా నిధులు ఇవ్వలేదని మంత్రి విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.