న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్ సభలో చర్చ మొదలైంది. స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలని కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్ లోక్‌సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చకు ప్యానెల్ స్పీకర్ జగదాంబిక పాల్ అనుమతిస్తూ.. చర్చకు 10 గంటల సమయం కేటాయించారు.
ఈ క్రమంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ అంశంపై చర్చను మొదలుపెట్టారు. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 278 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం లోక్ సభలో అధికార ఎన్డీఏకు 293, ప్రతిపక్ష ఇండి కూటమికి 234 మంది సభ్యుల మద్దతు ఉంది. సరైన సంఖ్యా బలం లేకపోవడంతో ఈ తీర్మానం వీగిపోయే అవకాశం ఉంది.
లోక్ సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ మాట్లాడుతూ.. స్పీకర్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ప్యానెల్ సభ్యుడిని సభకు అధ్యక్షత వహించడానికి స్పీకర్ అనుమతించడం రాజ్యాంగ ఉల్లంఘన అని పునరుద్ఘాటించారు. గతంలో ఇటువంటి తీర్మానాలు ప్రతిపాదించబడిన డిప్యూటీ స్పీకర్ సభా కార్యకలాపాలకు అధ్యక్షత వహించారని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ లేరని.. ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్‌ను నియమించడంలో విఫలం కావడంతోనే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని అన్నారు. స్పీకర్ లేకుండా రెండేళ్లుగా లోక్ సభ నడుస్తోందని అసహనం వ్యక్తం చేశారు. సభలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటే స్పీకర్ ఓం బిర్లా తరచూ అంతరాయం కలిగించేవారని ఆరోపించారు.
లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగానికి స్పీకర్ అనుమతించలేదన్నారు. 8 మంది విపక్ష సభ్యులను సరైన కారణం లేకుండానే స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారన్నారు. ప్రధాని మోడీపై కాంగ్రెస్ ఎంపీలు దాడి చేసే అవకాశం ఉందని స్పీకర్ తప్పుడు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని హితవు పలికారు.
