తెలంగాణ కొత్త గవర్నర్ గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లాకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. గవర్నర్ కు స్వాగతం పలికిన వారిలో సీఎం రేవంత్ తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ కె. రామకృష్ణా రావు, డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన శుక్లా 2014 ఎన్డీఏ కేబినెట్ లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
రాష్ట్ర గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా మార్చి 11న ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ చేతుల మీదుగా కొత్త గవర్నర్ ప్రమాణం చేయనున్నారు. ఇందుకు లోక్‌భవన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
మరోవైపు, బదిలీపై మహారాష్ట్రకు వెళ్తున్న జిష్ణుదేవ్ వర్మ సోమవారం రిలీవ్ అయ్యారు. బేగంపేట ఎయిర్ పోర్టులో గవర్నర్ దంపతులకు సీఎస్ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన వీడ్కోలు పలికారు.
