- నాపై పనిగట్టుకుని మొరిగే కుక్కను ఏ గొలుసుతో కట్టేయాలో బాగా తెలుసు
- వెలుగుమట్లలో 410 మంది నిజమైన పేదలకు ప్రభుత్వమే స్థలాలతో పాటు ఇండ్లు నిర్మించి ఇస్తదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డు పక్కన తనకు ఎలాంటి సంబంధం లేని క్రషర్‌ను చూపిస్తూ కొన్ని పిచ్చి కుక్కలు చాలా మొరుగుతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. తనపై పనిగట్టుకుని మొరిగే కుక్కను ఏ గొలుసుతో కట్టేయాలో తనకు బాగా తెలుసని.. ఇకనైనా ఆధారాల్లేని విమర్శలు మానుకోవాలన్నారు. ఆ క్వారీ తనదేనంటూ ప్రతిపక్ష నేతలు పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని.. అసలు క్రషర్ నడిపే ఓపిక తనకు లేదని.. అది తనది కాదని తేల్చి చెప్పారు. సోమవారం సెక్రటేరియెట్‌లో మీడియాతో మంత్రి పొంగులేటి చిట్చాట్చేశారు.
ఖమ్మంలోని వెలుగుమట్ల భూముల్లో ప్రభుత్వపరంగా సమగ్ర విచారణ జరిపించామని.. అందులో 410 మంది మాత్రమే నిజమైన అర్హులైన పేదలు ఉన్నారని తేలిందన్నారు. మిగిలిన 330 మంది లబ్ధిదారులు పూర్తిగా బోగస్ అని అధికారుల విచారణలో స్పష్టంగా నిర్ధారణ అయ్యిందన్నారు. అక్రమాలకు తమ ప్రభుత్వంలో తావులేదని ఆయన పేర్కొన్నారు. అర్హులైన 410 మంది నిరుపేదలకు ప్రభుత్వ పక్షాన త్వరలోనే ఇండ్ల స్థలాలతో పాటు, ఇండ్లు కూడా నిర్మించి ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే తమపై బీఆర్ఎస్ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. ఏమాత్రం ఆధారాలు లేకుండా క్రషర్, వెలుగుమట్ల భూముల పేర్లతో తనపై చిల్లర ఆరోపణలు చేస్తున్న వారి ఆటలు ఇక సాగవని మంత్రి హెచ్చరించారు.
ఈ నెల 16 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షనేత కేసీ ఆర్‌తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ హాజరైతే.. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభకు వస్తే.. ప్రతి విషయానికి సాక్ష్యాధారాలతో సమాధానం చెప్తామన్నారు. కానీ, ప్రతిపక్ష సభ్యులు ప్రజా సమస్యలను పక్కన పెట్టి, వారి సొంత ఎజెండాతో సభకు వస్తున్నారని మంత్రి విమర్శించారు.
