యాసంగి పంటల కొనుగోళ్లకు సన్నాహాలు

యాసంగి పంటల కొనుగోళ్లకు సన్నాహాలు
  • ప్రైస్​ సపోర్ట్​ స్కీమ్​ కింద కొనాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
  • అనుమతించాలని కేంద్రానికి లేఖ

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో పంటల కొనుగోళ్లకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. మార్క్‌‌‌‌‌‌‌‌ఫెడ్  ద్వారా పప్పు, శనగ, వేరుశనగ, పొద్దు తిరుగుడు, మినుములు వంటి పల్సెస్, నూనెగింజల పంటలను కనీస మద్దతు ధరతో కొనడానికి సిద్ధమవుతోంది. 2026–-27 యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్‌‌‌‌‌‌‌‌పీ ఆధారంగానే ఈ కొనుగోళ్లు జరపాలని భావిస్తోంది. ప్రైస్ సపోర్ట్ స్కీమ్(పీఎస్‌‌‌‌‌‌‌‌ఎస్) కింద ఈ పంటల కొనుగోలుకు అనుమతించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లెటర్​ రాశారు. మార్క్‌‌‌‌‌‌‌‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంట కొనుగోళ్లపై సీఎంతో చర్చించారు. 

పంటల వారీగా పరిస్థితి..

కేంద్రం ప్రకటించిన ఎంఎస్‌‌‌‌‌‌‌‌పీ ప్రకారం శనగ పప్పు క్వింటాల్ ధర రూ.5,875, వేరుశనగ రూ.7,263, సన్​ఫ్లవర్​(పొద్దు తిరుగుడు పువ్వు) రూ.7,721, మినుములు రూ.7,800గా నిర్ణయించారు.
పప్పు శనగ: రాష్ట్రంలో ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో 1.76 లక్షల ఎకరాలు సాగులో ఉండగా, సుమారు 1.25 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్​లో క్వింటాల్ ధర రూ.5 వేల నుంచి రూ.5,400 మధ్య ఉంది.

సన్​ ఫ్లవర్​: సుమారు 21 వేల ఎకరాల్లో సాగు జరగ్గా, 13 వేల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఇప్పుడు మార్కెట్​లో రూ.6 వేల నుంచి రూ.6,500 వరకు ఉంది.
వేరుశనగ: రాష్ట్రంలో 2.35 లక్షల ఎకరాల్లో సాగు కాగా, 2 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మద్దతు ధర రూ.7,263 కాగా ప్రస్తుతం మార్కెట్లో రూ.9 వేలకు పైగా ధర పలుకుతోంది.
మినుములు: ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో 56 వేల ఎకరాల్లో సాగైంది. సుమారు 40 వేల టన్నుల దిగుబడి వచ్చే అవకాశముంది. మద్దతు ధర రూ.7,800 కాగా మార్కెట్​లో రూ.8,200 నుంచి రూ.8,400 వరకు ఉంది.

మార్క్‌‌‌‌‌‌‌‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు..

గత వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌లో మక్కల కొనుగోళ్లను విజయవంతంగా నిర్వహించిన మార్క్‌‌‌‌‌‌‌‌ఫెడ్ ఈసారి పల్సెస్, నూనెగింజల కొనుగోళ్లపై దృష్టి సారించింది. కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే ప్రొక్యూర్‌‌‌‌‌‌‌‌మెంట్ సెంటర్ల ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు ఆధార్ కార్డు, పాస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌లతో నమోదు చేసుకుని తమ పంటలను నేరుగా విక్రయించవచ్చు. స్థానిక మార్కెట్ యార్డులు లేదా ప్రొక్యూర్‌‌‌‌‌‌‌‌మెంట్ సెంటర్లకు పంటను తీసుకువచ్చి అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.