భువనేశ్వర్: నీట్ పేపర్ లీక్ అంశంపై ఆందోళన చేపట్టిన జెన్జీ యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఆ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయడానికే తాను రాజీనామా చేశానని ఆయన వెల్లడించారు. ఈమేరకు శనివారం భువనేశ్వర్ లో జీఎం యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
రాజీనామా చేసిన తర్వాత తొలిసారి మౌనం వీడిన ప్రధాన్.. భారత్ ను విశ్వగురువుగా మార్చేది జెన్ జీ తరమేనని, వారి ఆకాంక్షల కన్నా తనకు కేంద్ర మంత్రి పదవి ఎక్కువ కాదని చెప్పారు. వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని తెలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించినట్లు ప్రధాన్ వివరించారు.
