చొరబాటుదారుల ఓట్ల కుట్రను తిప్పికొడదాం

చొరబాటుదారుల ఓట్ల కుట్రను తిప్పికొడదాం
  •     బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌‌రావు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌‌ఐఆర్‌‌) పేరుతో కాంగ్రెస్‌‌, బీఆర్‌‌ఎస్‌‌, ఎంఐఎం అక్రమ ఓట్ల దందాకు తెరలేపాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌‌రావు ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌‌లో నిర్వహించిన పార్టీ వర్క్‌‌షాప్‌‌లో ఆయన మాట్లాడారు. తమ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు రోహింగ్యాలు, బంగ్లాదేశీయులను అక్రమంగా ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కర్నాటక మోడల్‌‌లో హైదరాబాద్‌‌లోనూ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్‌‌ సర్టిఫికెట్‌‌ పేరుతో అక్రమ చొరబాటుదారులకు బ్యాక్‌‌డోర్‌‌ ద్వారా ఓటు హక్కు కల్పించే కుట్ర జరుగుతోందని అన్నారు. అధికార పార్టీ ఒత్తిడితో స్థానిక అధికారులు అక్రమ నమోదులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. 

దీనిపై బీజేపీ న్యాయపరంగా, రాజకీయంగా పోరాడుతుందని స్పష్టం చేశారు. ఆగస్టు 7న విడుదలైన డ్రాఫ్ట్‌‌ ఓటర్ల జాబితాను పార్టీ శ్రేణులు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ప్రతి బూత్‌‌లోని బోగస్‌‌, డూప్లికేట్‌‌ ఓట్లను గుర్తించి తొలగించాలని, అర్హులైన కొత్త ఓటర్లను చేర్చడంతో పాటు వివరాల సవరణకు ఫారం-6, 7, 8లను సమర్థంగా వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన డేటా సేకరణను వేగవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌‌రెడ్డి, ఈటల రాజేందర్‌‌, రఘునందన్‌‌రావు, శశిధర్‌‌రెడ్డి పాల్గొన్నారు.