న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇంటి ముందు శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముస్లిం వ్యతిరేక నిరసనలు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి పేలుడు పదార్థాన్నీ ఇంట్లోకి విసరడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
తీవ్రవాద ఇన్ఫ్లుయెన్సుర్ జేక్ లాంగ్ ఆధ్వర్యంలో కొంతమంది ఇస్లామీకరణకు వ్యతిరేకంగా, బహిరంగ ప్రార్థనలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మేయర్ ఇంటి ముందు నిరసన చేపట్టారు. వీరికి వ్యతిరేకంగా మరో వర్గం కూడా అక్కడకు చేరుకొని నినాదాలు చేసింది.
అయితే నిరసనలు జరుగుతుండగా అమీర్ బాలాట్ అనే 18 ఏళ్ల యువకుడు మంటలు, పొగ వ్యాపించే పదార్ధాలను ఒకటి పోలీసుల వైపు, మరొకటి నిరసనకారుల వైపు విసిరాడు. ఇది పేలలేదు కానీ, దాన్ని చూసి అందరూ అక్కడ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
వెంటనే బాంబ్ స్క్వాడ్ వచ్చి చెక్ చేయగా, బ్లాక్ టేప్‌తో చుట్టిన ఓ వస్తువులో నట్లు, బోల్ట్స్, స్క్రూలు, అంటించడానికి వీలుగా ఫ్యూజ్‌లు ఉన్నట్లు గుర్తించారు. అయితే అందులో నిజంగా పేలుడు పదార్థం ఉందో లేదో తెలియలేదు.
నిందితుడు అమీర్ బాలాట్‌తో పాటు, నిరసనలో పెప్పర్ స్ప్రే ఉపయోగించిన వ్యక్తిని, మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన సమయంలో మేయర్ ఇంట్లో లేరని తెలుస్తోంది. న్యూయార్క్ విభిన్న సంస్కృతులగల నగరమని, ఇక్కడ ద్వేషానికి తావులేదని మేయర్‌కు మద్దతుగా వచ్చిన వారు నినాదాలు చేసారు.
