అవేర్ నెస్ : క్యాన్సర్​ను  మొదట్లోనే గుర్తించొచ్చు!

 అవేర్ నెస్ : క్యాన్సర్​ను  మొదట్లోనే గుర్తించొచ్చు!

క్యాన్సర్​ను తొలి దశలోనే గుర్తిస్తే చాలా వరకు మరణాలను ఆపొచ్చు. అలా గుర్తించేందుకు వీలుగా కొన్ని ఇన్వెన్షన్లు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. అలాగే క్యాన్సర్​ బారిన పడ్డాక  కొన్ని రకాల కేర్​ అవసరం. ఆ కేర్​కు సంబంధించి కొన్ని వస్తువులు ఉంటాయి. వాటిని కూడా కొత్తగా తయారుచేస్తూనే ఉన్నారు.

ఇండియాలో మగవాళ్ల కంటే ఆడవాళ్లే క్యాన్సర్​ బారిన ఎక్కువగా పడుతున్నారు. అందులో  బ్రెస్ట్​ క్యాన్సర్​ కేసులు ఎక్కువ. ఆ తరువాత సర్విక్స్​, అండాశయ, కార్పస్​ యుటెరి క్యాన్సర్​లు ఉంటున్నాయి.

థర్మాలిటిక్స్​

నిరమయ్​ అనే సంస్కృత పదానికి ‘జబ్బులు లేని’ అని అర్థం. ఆ పేరు పెట్టుకున్న సంస్థ థర్మాలిటిక్స్​ సాయంతో క్యాన్సర్​ను తొలి దశలోనే గుర్తించే టెక్నాలజీ కనుక్కొంది. ఈ టెస్ట్​కు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు” అన్నారు రీసెర్చ్​ సైంటిస్ట్​, నిరమయ్​ సంస్థ ఫౌండర్​ గీతా మంజునాథ్​. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ ద్వారా పనిచేసే దీనివల్ల రేడియేషన్​ బారిన పడరు. శరీరం మీద  కోత లేకుండానే తొలి దశలో ఉన్న బ్రెస్ట్​ క్యాన్సర్​ను గుర్తించొచ్చు.

థర్మల్​ ఇమేజింగ్​ ద్వారా ఛాతి ఉష్ణోగ్రతల్లో తేడా కనిపెడుతుంది ఈ డివైజ్. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ ఉష్ణోగ్రతలను క్యాన్సర్​ స్క్రీనింగ్​ రిపోర్ట్​కు సరఫరా​ చేస్తుంది. అది ఉష్ణోగ్రతల్లో అసాధారణ పరిస్థితులు ఉన్నాయా? లేదా? చెప్తుంది. ఈ టెస్ట్​లో తేడా ఉంటే మమ్మోగ్రామ్​ లేదా అల్ట్రాసౌండ్​ టెస్ట్​లకు వెళ్లొచ్చు. అనుమానంతో వందల మంది మమ్మోగ్రామ్​ లేదా అల్ట్రాసౌండ్​ పరీక్షలు చేయించుకోవడాన్ని తప్పిస్తుంది ఈ డివైజ్​. ఇది యూనివర్శల్​ క్యాన్సర్​ స్క్రీనింగ్​ సొల్యూషన్​.

సర్విచెక్​

సర్వైకల్​ క్యాన్సర్​ను తొలిదశలో గుర్తిస్తే చికిత్స చేయడం ఈజీ. పూర్తిగా నయం చేయొచ్చు కూడా. ఇమ్యూన్​ సిస్టమ్​ మూమూలుగా ఉన్న మహిళల్లో సర్వైకల్​ క్యాన్సర్​ డెవలప్​ అయ్యేందుకు 15 నుంచి 20 ఏండ్ల టైం పడుతుంది. అదే  ఇమ్యూన్​ సిస్టమ్​ అంత బాగా లేని వాళ్లలో ఐదు నుంచి పదేండ్లలో సర్వైకల్​ క్యాన్సర్​ డెవలప్​ అవుతుంది.  వడోదరకు చెందిన అనిర్బన్​ పాలిట్​, తన భార్య డాక్టర్​ సయాంతని ప్రామాణిక్​తో కలిసి ‘సర్విచెక్​’ అనే డివైజ్​ తయారు చేశాడు. సెల్ఫ్​ శాంప్లింగ్​ కిట్​తో ఇంట్లోనే సర్వైకల్​ క్యాన్సర్​ టెస్ట్​ చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు ఇంట్లోనే శాంపిల్స్​ కలెక్ట్​ చేసుకోవచ్చు. ఈ కిట్​ హెచ్​పివి(హ్యూమన్​ పాలిల్లోమావైరస్​)ను గుర్తించడంలో సరైన రిజల్ట్​ ఇస్తుంది. ఇదొక్కటే కాకుండా గైనకాలజిస్ట్​లకు సర్వైకల్ క్యాన్సర్​ చికిత్స చేసే స్టేజిలో ఉందో .. లేదో.. కూడా చెప్తుందన్నాడు అనిర్బన్​

సాయిషా ఇండియా

ముంబయికి చెందిన జయశ్రీ రతన్ బ్రెస్ట్​ క్యాన్సర్​ సర్వైవర్స్​ కోసం​ క్రొషెట్​ బ్రెస్ట్​తయారుచేసింది. ‘‘కాటన్​తో వీటిని తయారుచేయడం వల్ల మెత్తగా ఉంటుంది. అలర్జీలు రావు. చేత్తో ఉతుక్కోవచ్చు. మాస్టెక్టమీ బ్రాలో సరిగా ఫిట్​ అవుతుంది కూడా. కొందరు మహిళలు సిలికాన్​ బ్రెస్ట్​ వాడతారు. కానీ చాలామంది ఫుల్​ బ్రెస్ట్​ అప్పియరెన్స్​ కోసం హ్యాండ్​ కర్చీఫ్​, కాటన్​ ఉండలు బ్రాలో పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల ర్యాష్​, ఇన్ఫెక్షన్​ వచ్చే ప్రమాదం ఉంది. చర్మం మీద ఒరుసుకుపోతుంది కూడా. బ్రెస్ట్ క్యాన్సర్​ సర్వైవర్స్​కు సాయం చేసేందుకు క్రొషెట్​ ప్రొస్తసిస్​లు తయారుచేస్తున్నా” అంటోంది జయశ్రీ. 

మమ్మొమొబైల్​

కాగ్నిటివ్​ సైకో థెరపిస్ట్​, సైంటిస్ట్​ అయిన షాడి గంజ్​.. క్యాన్సర్​తో పోరాడి గెలిచింది. అందుకని తమిళనాడులోని పల్లెల్లో క్యాన్సర్​ను తొలిదశలోనే గుర్తిస్తే ఎంతోమంది ఆ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా ఉంటారని  బ్రెస్ట్​, సర్వైకల్​ క్యాన్సర్​ స్ర్కీనింగ్​ బస్​ నడుపుతోంది. ఈ బస్​లో మమ్మోగ్రామ్​ మెషిన్​, కంట్రోల్​ రూమ్​ ఉన్నాయి. మమ్మోగ్రామ్​ రిజల్ట్​ను వెంటనే కలెక్ట్​ చేసుకోవచ్చు. ఇంకో సెక్షన్​లో సర్వైకల్​ క్యాన్సర్​ టెస్టింగ్​ కోసం ఒక గది ఉంది. మమ్మొమొబైల్​ తమిళనాడులో 92 గ్రామాలకు వెళ్లింది. నెలకు 500 వరకు మమ్మోగ్రామ్స్​ చేస్తోంది.

గంగా గోదావరి క్యాన్సర్​ స్క్రీనింగ్​

ఇండియాలో 2040 కల్లా కొన్ని లక్షల మంది మహిళల్లో యుటిరైన్​ క్యాన్సర్​ బారిన పడే అవకాశం ఉంది. అందుకని గంగా గోదావరి క్యాన్సర్​ స్క్రీనింగ్​ ప్రోగ్రామ్​ ద్వారా గ్లోబల్​ ఫార్మాస్యూటికల్​ కంపెనీ ఆస్ట్రాజెనికా మహిళల్లో క్యాన్సర్​ను తొలిదశలో గుర్తించేందుకు సాయం చేస్తోంది.

గంగా గోదావరి క్యాన్సర్​ స్క్రీనింగ్​ ప్రోగ్రామ్​ ద్వారా 2019 నుంచి 76 స్క్రీనింగ్​ క్యాంపులు పెట్టారు. నాలుగువేల మంది మహిళలకు సాయపడ్డారు. 200 మందికి తొలిదశలో క్యాన్సర్​ కనిపెట్టి, చికిత్స కోసం హాస్పిటల్స్​కు పంపించగలిగారు. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రోగ్రామ్​ 2.3 మిలియన్ల మంది మహిళలు, వాళ్ల కుటుంబాల మీద ప్రభావం చూపింది. మా గోల్​ 2024 వరకు ఐదు మిలియన్ల మందిని మా ప్రోగ్రామ్​ ద్వారా చేరుకోవాలి అంటున్నారు ఆ కంపెనీ ప్రతినిధులు.ఏదేమైనా క్యాన్సర్​ను తొలిదశలో గుర్తించడం అనేది ముఖ్యం. ఈ విషయం నేది అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.