ధోని రిటైర్మెంట్‌ ప్రకటించి నేటితో రెండేళ్లు

ధోని రిటైర్మెంట్‌ ప్రకటించి నేటితో రెండేళ్లు

టీంఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి నేటితో(ఆగస్టు15)తో రెండేళ్లు పూర్తైంది. ఈ క్రమంలో ధోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. " మీ ప్రేమ,  మద్దతుకు చాలా ధన్యవాదాలు. 19:29 గంటలు ( రాత్రి 7:29 గంటలు) నుంచి రిటైర్మెంట్‌గా పరిగణించండి." అంటూ క్యాప్షన్ పెట్టాడు.  

2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ధోని తన తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ తో ఆడాడు. మొదటి మ్యాచ్ లో డకౌట్ అయినా ఆ తర్వాత జట్టులో కీలకమైన ఆటగాడిగా, తిరుగులేని ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 2007లో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకొని జట్టుకు ఎన్నో తిరుగులేని విజయాలను అందించాడు. కెప్టెన్‌గా భారత్‌కు 2007లో టీ20 వరల్డ్‌కప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ అందించాడు. వరల్డ్  క్రికెట్ లో 3 ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ధోని నిలిచాడు.

2019 వన్డే ప్రపంచకప్ తరువాత ధోని సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చాడు. అతని వీడ్కోలు చెప్పిన అరగంటకే సురేశ్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 350 వన్డేలు ఆడిన ధోని 10,773 పరుగులు చేశాడు. 98 టీ20లు ఆడి 1,617 పరుగులు తీశాడు. 90 టెస్టులు ఆడి 4,876 రన్స్ సాధించాడు. 


ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి నేటితో రెండేళ్లు పూర్తియిన సందర్భంగా నెటిజన్లు ధోని సాధించిన ఘనతలను గుర్తు చేసుకుంటున్నారు.