పరేషాన్​ చేస్తున్నసిటీ బస్సు

పరేషాన్​ చేస్తున్నసిటీ బస్సు

హైదరాబాద్, వెలుగుసిటీలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలంటే జనం జంకుతున్నారు. భద్రతను లెక్క చేయకుండా ఎవరిని పడితే వారిని డ్రైవర్లుగా నియమిస్తుండటంతో అది కాస్త ప్రయాణికుల ప్రాణాల మీదకు తెస్తోంది. 3 రోజుల క్రితం మేడ్చల్ లో.. రెండు రోజుల క్రితం అబ్బుల్లాపూర్ మెట్, కూకట్ పల్లిలో, బుధవారం అంబర్​పేటలో జరిగిన ప్రమాదాలతో ప్రయాణికుల్లో వణుకు మొదలైంది. నైపుణ్యం లేని డ్రైవర్లు ప్రయాణికుల పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. అడిగే వారు లేరు. పర్యవేక్షణ లేదు. దీంతో ఇష్టానుసారంగా బస్సులను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.

రెండు చోట్ల తాగి నడిపినోళ్లే

తాత్కాలిక డ్రైవర్లు మందు తాగుతూ బస్సులు నడుపుతున్నారు. అబ్దుల్లాపూర్ మెట్, కూకట్ పల్లిలో జరిగిన రెండు ప్రమాదాల్లో తాత్కాలిక డ్రైవర్లు మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే ప్రస్తుతం ఆర్టీఏ అధికారులు నియమించిన డ్రైవర్లలో ఎక్కువ మంది భారీ వాహనాలను నడిపే వారే. వారిలో చాలా మందికి మందు అలవాటు ఉంటుంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు అయితే డిపో నుంచి వెళ్లే ముందు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారు. మద్యం తాగినట్లు తేలితే డ్రైవర్ ను డ్యూటీకి అనుమతించారు. కానీ ప్రస్తుతం తాత్కాలిక డ్రైవర్లకు ఎలాంటి టెస్ట్ లు చేయటం లేదు.

బాధ్యత ఉంటేగా?

ఆర్టీసీ బస్సులంటేనే సామాజిక సేవలో భాగం. ఆర్టీసీ డ్రైవర్లకు ఆ స్పృహ ఉంటుంది. చేయి ఎత్తిన చోట బస్సులను ఆపుతూ ప్రయాణికులతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకవేళ డ్రైవర్ దురుసుగా ప్రవర్తించినా వారిపై డిపో మేనేజర్ కు కంప్లైంట్ చేసే హక్కు ప్యాసింజర్ కు ఉంటుంది. ఉద్యోగ భయం ఉన్న ఆర్టీసీ డ్రైవర్లు ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తారు. కానీ తాత్కాలిక డ్రైవర్ల ప్రవర్తన సిటీ బస్సులు ఎక్కే ప్రయాణికులను పరేషాన్ చేస్తోంది. కొంతమంది సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. మరికొంత మంది స్టాప్ ల వద్ద బస్సులను ఆపకుండా వెళ్లిపోతున్నారు. ప్రయాణికులతో మర్యాద లేకుండా మాట్లాడుతున్న ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇక్కడ అంత ఈజీ కాదు

హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికే అనుమతిస్తామని ఆర్టీఏ అధికారులు చెబుతున్నప్పటికీ అలాంటి డ్రైవర్లు సిటీ బస్సులు నడపటం అంత ఈజీ కాదు. హెవీ వెహికిల్స్ నడిపేటోళ్లు జాతీయ రహదారులపై వేగంగా పోతుంటారు. కానీ సిటీ ట్రాఫిక్ లో వేగం గంటకు18 కిలోమీటర్లు మించదు. పైగా ఐదు నిమిషాలకొక స్టాఫ్ వద్ద బస్సు ఆపాల్సి ఉంటుంది. దీనికి కనీసం కొన్ని రోజుల పాటు శిక్షణ అవసరం. పైగా ఆర్టీసీలో సిటీ బస్సులు కాలం చెల్లినవే సగం ఉన్నాయి. వాటిని చెక్ చేయకుండానే బయటకు తెచ్చేస్తున్నారు. దీంతో తరచూ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది.

సమ్మె 13వ రోజుకు చేరినప్పటికీ పూర్తిస్థాయిలో బస్సుల సంఖ్యను పెంచటంలో ప్రభుత్వం విఫలమైంది. జీహెచ్ఎంసీ లో వాహనాలకు డ్రైవర్లు పనిచేసే కొంతమంది ఆర్టీసీ డ్రైవర్లుగానూ అవతారం ఎత్తారు. వీక్ ఆఫ్ లేదా ఒకే రోజు సమయం అడ్జస్ట్ చేసుకుంటూ రెండు డ్యూటీలు చేస్తున్నారు. అటు ప్రయాణికుల వద్ద నుంచి అదనపు చార్జీల దోపిడీ కొనసాగుతూనే ఉంది.

70% రూట్లకు బస్సుల్లేవ్

రంగారెడ్డి జిల్లా: ఆర్టీసీ సమ్మె బుధవారంతో 12వ రోజుకు చేరుకుంది. గ్రేటర్‌‌లోని 29 బస్ డిపోల పరిధిలో 3,800 బస్సులున్నాయి.  వీటిలో 1400 రోడ్డెక్కాయి. అందులో 345 అద్దెబస్సులు, 1055 బస్సులను  ప్రైవేట్‌‌ డ్రైవర్లు, కండక్టర్లతో నడిపిస్తున్నారు. దాదాపు 70 శాతం రూట్లకు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. హయత్‌‌నగర్ నుంచి లింగంపల్లి, హయత్‌‌నగర్‌‌ నుంచి కొండాపూర్‌‌కు, కోఠీ నుంచి కొండాపూర్‌‌కు, ఎంజీబీఎస్‌‌ నుంచి ముషీరాబాద్‌‌కు, మోహిదీపట్నం నుంచి సికింద్రాబాద్‌‌కు రూట్లకు కావాల్సిన సంఖ్యలో బస్సులు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. సాయంత్రం 7 దాటీతే నగరంలో ఒక్క బస్సు కనిపించడం లేదు.