లేని వడ్లను కొన్నట్టుగా చూపిస్తూ దందా 

లేని వడ్లను కొన్నట్టుగా చూపిస్తూ దందా 

ఖాళీ ట్రక్​షీట్లతో రేషన్​ బియ్యం రీసైక్లింగ్​
ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో రైస్​ మిల్లర్లు కొత్త దందాకు తెరలేపారు. ఇప్పటివరకు తరుగు పేరుతో రైతులను దోచుకోగా తాజాగా ఖాళీ ట్రక్​షీట్లతో రేషన్​బియ్యం రీసైక్లింగ్​కు ప్రయత్నిస్తున్నట్లు ‘వెలుగు’ పరిశీలనలో వెల్లడైంది. కొంతమంది సొసైటీల అధికారులతో రైస్​మిల్లర్లు కుమ్మక్కై ఖాళీ ట్రక్​ షీట్లను సంపాదించి, వాటి ద్వారా వడ్లు కొనకుండానే కొన్నట్టుగా రికార్డులు సృష్టిస్తున్నారు. ఆ ధాన్యానికి తగిన లెవీ బియ్యాన్ని సివిల్ సప్లైస్​ డిపార్ట్ మెంట్ కు సరఫరా చేసేందుకు రేషన్​ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారని తేలింది. 
మిల్లర్ల అక్రమాలిలా..
లేని వడ్లను కొన్నట్లు తప్పుడు రికార్డులు సృష్టించి, ట్రక్​షీట్లు క్రియేట్​చేసి దాదాపు రూ. కోటి వరకు అవినీతికి పాల్పడిన ఏదులాపురం సొసైటీ వ్యవహారంలో మొత్తం ముగ్గురు మిల్లర్లు కీలకపాత్ర పోషించారు. ప్రధానంగా రూరల్​మండలానికి చెందిన ఒక మిల్లరు సూత్రధారిగా వ్యవహరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొసైటీ సీఈఓతో తనకున్న పరిచయంతో ఖాళీ ట్రక్​ షీట్లను సంపాదించాడు. ఈ వ్యవహారంలో సీఈఓకు, మిల్లరుకు మధ్య డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. తన సొంత గ్రామానికి చెందిన రైతులు, పరిచయస్తులు, బంధువుల పేర్లపై ధాన్యం అమ్మినట్టుగా ఖాళీ ట్రక్​ షీట్లపై రాశాడు. అదే మండలానికి చెందిన మరో మిల్లరు, భద్రాచలానికి చెందిన ఇంకో మిల్లరు కూడా ఇదే తరహాలో దాదాపు 20 నుంచి 30 ట్రక్​ షీట్ల వరకు ఖాళీవి తీసుకొని అక్రమాలకు పాల్పడ్డారు. ఇక సొసైటీల ద్వారా వచ్చిన ధాన్యానికి క్వింటాకు 69 కేజీల చొప్పున లేవీ బియ్యాన్ని ప్రభుత్వానికి మిల్లర్లు సప్లై చేయాల్సి ఉంటుంది. అసలు ధాన్యం లేకుండానే తప్పుడు పేపర్లతో ట్రక్​ షీట్లు తయారు కాగా, బియ్యాన్ని మరో అక్రమ పద్ధతిలో సేకరిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్​ బియ్యాన్ని అడ్డదారిలో దళారుల నుంచి సేకరించి, దాన్నే పాలిష్ చేసి లేవీ బియ్యంగా రీసైక్లింగ్ చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్, పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా జిల్లా నుంచి రెగ్యులర్​గా రేషన్​ బియ్యం లారీల్లో ఇతర జిల్లాలకు తరలిపోవడం, అక్కడక్కడ పోలీసులకు పట్టుబడడం కామన్​గా మారింది. రేషన్​ బియ్యం రీసైక్లింగ్ వ్యవహారం బహిరంగ రహస్యంగా మారినా, ఖాళీ ట్రక్​షీట్లను సంపాదించి మళ్లీ ప్రభుత్వానికి లెవీ రూపంలో బియ్యాన్ని సప్లై చేస్తున్న లింకులు, ఆధారాలు బయటపడడం మాత్రం రాష్ట్రంలో ఇదే మొదటిసారి. ఈ బియ్యం రీసైక్లింగ్ విషయాన్ని జిల్లా సహకార శాఖలోని ఒక ఉన్నతాధికారి కూడా ధ్రువీకరించారు. ధాన్యం కొనకుండా ఈ విధంగా మిల్లర్లు మేనేజ్​ చేస్తున్నారని చెప్పారు. 
సస్పెండ్ అయినా డ్యూటీలోనే.. 
ఇక ఏదులాపురం సొసైటీ సీఈఓ సస్పెండ్ అయిన తర్వాత కూడా దాదాపు రెండు నెలల పాటు అదే ఆఫీసులో డ్యూటీ చేయడం గమనార్హం. దాదాపు ఆరేళ్ల నుంచి డి.నరసింహారావు అనే వ్యక్తి ఏదులాపురం పీఏసీఎస్​ సీఈఓగా కొనసాగుతున్నారు. ఆయన అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, ఓచర్లు లేకుండానే సొసైటీ నిధులను దారి మళ్లిస్తున్నారని కొన్ని నెలల క్రితం సొసైటీ చైర్మన్​ ధర్మారెడ్డి డీసీఓకు కంప్లైంట్ చేశారు. దీంతో శాఖాపరమైన ఎంక్వైరీ చేసిన తర్వాత ఈఏడాది జులై 12న సీఈఓ నరసింహారావును సస్పెండ్ చేస్తూ డీసీఓ ఆదేశాలు జారీ చేశారు. గత సీజన్​ లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం రూ.4.20 లక్షలు ఖర్చు చూపారని, తన వ్యక్తిగత వేతనం రూపంలో రూ.71 వేల వరకు అదనంగా డ్రా చేసుకున్నారని ఎంక్వైరీలో తేలినట్టు డీసీఓ ఆదేశాల్లో ఉన్నాయి. అయితే డీసీఓ సస్పెన్షన్​ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా సొసైటీ సమావేశాల్లో ఈ తీర్మానాన్ని ఆమోదించిన మినిట్స్ ను డీసీఓ ఆఫీసుకు ఈ నెల మొదటివారంలో సబ్​మిట్ చేశారు. అంటే దాదాపు రెండు నెలల పాటు ఆయన డ్యూటీలో కొనసాగారు. ఈ నెల 6న తిరుమలాయపాలెం సొసైటీ సీఈఓ శ్రీనివాస్​రెడ్డి ఇన్​చార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. దీనిపై మరోసారి ఏదులాపురం సొసైటీ చైర్మన్​ ధర్మారెడ్డి తాజాగా డీసీఓకు, జిల్లా కలెక్టర్​ కు ఫిర్యాదు చేశారు. అయితే సొసైటీ వ్యవహారాల్లో చైర్మన్​ ధర్మారెడ్డి పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించారని నర్సింహారావు ఆరోపిస్తున్నారు. ఆయన చేసిన అవినీతి బయటపడుతుందని ముందుగానే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. 

ట్రక్​ షీట్లు, అక్రమాల బాధ్యత సీఈఓదే
సొసైటీ నిధులు, ట్రక్​ షీట్లలో సీఈఓ నర్సింహారావు అక్రమాలకు పాల్పడ్డారు. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, కాంట్రాక్టు సిబ్బంది వేతనంతో పాటు సొంత శాలరీ విషయంలో కూడా ఎక్కువ మొత్తంలో ఓచర్లు రాసి నిధులు దుర్వినియోగం చేశారు. దీనిపై గతంలోనే జిల్లా కోఆపరేటివ్​ఆఫీసర్​ కు కంప్లైంట్ చేశాను. విచారణ చేసిన తర్వాత ఆయన్ను సస్పెండ్ చేశారు. ట్రక్​ షీట్లకు సంబంధించిన అక్రమాలపై కూడా ఆయనపై విచారణ చేయించాలని డీసీఓకు, కలెక్టర్​కు ఫిర్యాదు చేశాను.                                        ‑ ఏనుగు ధర్మారెడ్డి, ఏదులాపురం పీఏసీఎస్​ ఛైర్మన్


అక్రమాలపై ఎంక్వైరీ చేస్తున్నాం
ఏదులాపురం సొసైటీలో అక్రమాలపై విచారణ చేస్తున్నాం. కోఆపరేటివ్ చట్టం ప్రకారం ఇప్పటికే డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కో ఆపరేటివ్ ఆఫీసర్​ఆధ్వర్యంలో కమిటీని విచారణకు నియమించాం. నిధుల వినియోగంలో అక్రమాలకు సంబంధించి గతంలోనే సీఈఓను సస్పెండ్ చేసినా, సొసైటీ మీటింగ్ మినిట్స్ రావడంలో ఆలస్యం వల్లే మొన్నటి వరకు డ్యూటీ చేశారు. విచారణ తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు చెబుతాం.  
                                                                                                                                                 ‑ విజయకుమారి, జిల్లా సహకార శాఖ అధికారి