వెహికల్స్‌పై కంటైనర్ బోల్తా.. 12 మంది దుర్మరణం

వెహికల్స్‌పై కంటైనర్ బోల్తా.. 12 మంది దుర్మరణం

చిత్తూరు జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్‌కు బ్రేకులు ఫైయిల్ కావడంతో పలు వాహనాలపై బోల్తా పడి 12 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

బంగారుపాళ్యం మండలం చిత్తూరు-బెంగళూరు జాతీయ రహదారిపై మొగిలిఘాట్‌ దగ్గర వాహనాలపై కంటైనర్‌ బోల్తాపడింది.  బ్రేకులు ఫెయిల్ కావడంతో ఆటో, ఓమ్ని వ్యాన్‌, బైక్‌పైకి కంటైనర్‌ దూసుకెళ్లింది. ఒక్కసారిగా వాటిపై తిరగబడింది. విషయం తెలియగానే హుటాహుటీన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. జేసీబీ, క్రేన్ల సాయంతో కంటైనర్ ను పక్కకు తీసి సహాయ చర్యలు స్టార్ట్ చేశారు. సహాయ చర్యలను దగ్గరుండి చూసుకునేందుకు జిల్లా కలెక్టర్ నారాయన్ భరత్ గుప్తా నేరుగా యాక్సిడెంట్ స్పాట్‌కు చేరుకున్నారు.

ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరికొంత మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 వాహనంలో సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చీకటి పడటంతో మృతదేహాల గుర్తింపు కష్టతరంగా మారింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓ వైపు కంటైనర్‌కు బ్రేకులు ఫెయిల్ అవ్వడం, మరోవైపు అతి వేగం కారణంగా ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది.

ఒకే కుటుంబంలో ఎనిమిది మంది మృతి

ఈ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. గంగవరం మండలం మరిమాకుల గ్రామానికి చెందిన వారు మినీ వ్యాన్‌లో చిత్తూరు నుంచి గంగవరం వెళ్తుండగా దానిపై కంటైనర్ బోల్తా పడింది. మరణించిన వారి పేర్లు… రామచంద్ర (50), రాము (38), సావిత్రమ్మ (40), ప్రమీల (37), గురమ్మ (52), సుబ్రమణ్యం (49), శేఖర్ (45), పాపమ్మ (49). ఒకే కుటుంబంలో ఎనిమిది మంది మరణించడంతో ఆ ఊరంతా విషాదంలో మునిగిపోయింది.

అలాగే కంటైనర్ కిందపడిన ద్విచక్ర వాహన దారుడు నరేంద్ర (37) అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు. అతడిది పలమనేరు మండలం బలిజపల్లి గా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ డ్రైవర్, క్లీనర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.