ఎలక్షన్‌‌ ఖర్చు చూపని క్యాండిడేట్లకు ఎస్‌‌ఈసీ షాక్.. 1946 మందిపై వేటు‌‌

ఎలక్షన్‌‌ ఖర్చు చూపని క్యాండిడేట్లకు ఎస్‌‌ఈసీ షాక్.. 1946 మందిపై వేటు‌‌
  • లెక్కలు చూపని 1946 మందిపై వేటు
  • ఎలక్షన్‌‌ ఖర్చు చూపని క్యాండిడేట్లకు ఎస్‌‌ఈసీ షాక్‌‌

రెండేళ్ల కిందట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన క్యాండిడేట్లు ఎలక్షన్‌‌ ఖర్చులు చూపని కారణంగా అనర్హత వేటుకు గురయ్యారు. ఆసిఫాబాద్‌‌ జిల్లాలో ఇలాంటి 1946 మందిని 2024 వరకు పోటీకి అనర్హులుగా పేర్కొంటూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ప్రస్తుతం పదవులు అనుభవిస్తున్న వారు సైతం ఉన్నారు. వీరంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. 

ఆసిఫాబాద్, వెలుగు: ఎలక్షన్ రూల్స్‌‌ ప్రకారం పోటీచేసిన క్యాండిడేట్లంతా పెట్టిన ఖర్చు వివరాలను ఎన్నికల ప్రక్రియ ముగిసిన 45 రోజుల్లో ఎంపీడీవో ఆఫీసుల్లో అందజేయాల్సి ఉంటుంది. ఎలక్షన్‌‌ కమిషన్ రూపొందించిన ఫార్మాట్‌‌లో ఖర్చుల వివరాలు చెప్పాలి. ఈసీ సూచించిన మొత్తానికంటే ఎక్కువ ఖర్చు చేసినా, లెక్కలు చూపకపోయినా అనర్హత వేటు వేస్తారు. వీరు భవిష్యత్తు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండదు.  జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌‌, వార్డుమెంబర్లుగా పోటీ చేసిన క్యాండిడేట్లలో ఎక్కువ మంది ఈ విషయాన్ని లైట్‌‌ తీసుకున్నారు. ఆఫీసర్లు రెండు సార్లు వివరాలు సమర్పించాలని నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. దీంతో వేటుకు గురయ్యారు.  లెక్కలు చూపని అభ్యర్థులపై అనర్హత వేటు వేస్తూ లిస్ట్‌‌ను ఈసీ ఎంపీడీవో ఆఫీసులకు పంపించింది. ఈ విషయం తెలిసిన వెంటనే అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. కొంతమంది క్యాండిడేట్లు తాము గతంలోనే ఖర్చుల వివరాలు ఇచ్చామని, ఆఫీసర్లు ఆన్‌‌లైన్‌‌లో ఎంటర్‌‌‌‌ చేయకపోవడంతోనే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు. అయితే ఆఫీసర్లు మాత్రం తమకు ఖర్చుల వివరాలు అందలేదని చెబుతున్నారు. 
 

వందల్లో క్యాండిడేట్లు..
అనర్హత వేటు పడ్డ వారిలో  గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీలు సైతం ఉన్నారు. చింతమలనేపల్లి  మండలంలో గెలిచిన ఒక సర్పంచ్‌‌తోపాటు ఓడిపోయిన 22 మంది సర్పంచ్ క్యాండిడేట్లు,  151 మంది వార్డు సభ్యులకుగాను 43 మంది గెలిచిన వార్డు మెంబర్లు ,108 మంది ఓడిపోయిన క్యాండిడేట్లు ఈ జాబితాలో ఉన్నారు. అలాగే లింగాపూర్ మండలంలో పోటీ చేసిన సర్పంచ్ క్యాండిడేట్లు 15మంది, 58 మంది గెలిచిన,48 మంది ఓడిన వార్డ్‌‌ మెంబర్‌‌‌‌ క్యాండిడేట్లు , వాంకిడి మండలంలో 40 మంది ఓడిన సర్పంచ్ క్యాండిడేట్స్,  ఇద్దరు గెలిచిన,18 మంది ఓడిన ఎంపీటీసీ క్యాండిడేట్స్, 73 మంది గెలిచిన,103 మంది ఓడిన వార్డ్‌‌ మెంబర్‌‌‌‌ క్యాండిడేట్లను అనర్హులుగా ప్రకటిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈసీ ఆదేశాల మేరకు చర్యలు.. 
స్ధానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన క్యాండిడేట్లు ఎన్నికల ప్రక్రియ ముగిసిన 45 రోజుల్లో ఖర్చుల వివరాలను ఎన్నికల కమిషన్‌‌కు అందించాల్సి ఉంటుంది. లెక్కలు సమర్పించాలని క్యాండిడేట్లకు పలుమార్లు నోటీసులు ఇచ్చాం. అయినా ఎవరూ స్పందించలేదు. దీంతో ఈసీ అనర్హత వేటుకు ఉత్తర్వులు జారీ చేసింది.  ఈసీ ఆదేశాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం.
‑ సాయగౌడ్, జడ్పీ సీఈవో, ఆసిఫాబాద్

వేటుపడ్డ క్యాండిడేట్ల వివరాలు..
జడ్పీటీసీ అభ్యర్థులు ఓడిన వారు 26 మంది

 

ఎంపీటీసీ అభ్యర్థులు 191
గెలిచిన వారు 3
ఓడిన వారు 188

 

సర్పంచ్ అభ్యర్థులు 257
గెలిచిన వారు 04
ఓడిన వారు 253

వార్డు సభ్యులు అభ్యర్థులు 1472
గెలిచిన వారు 364
ఓడినవారు 1108