జర్నలిజం కోర్సుల్లో మార్పులు జరగాలి: సీనియర్ ఎడిటర్ కె. శ్రీనివాస్

జర్నలిజం కోర్సుల్లో మార్పులు జరగాలి: సీనియర్ ఎడిటర్ కె. శ్రీనివాస్

హైదరాబాద్, వెలుగు: మారుతున్న జర్నలిజానికి తగ్గట్టు కోర్సుల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వర్సిటీల్లో నేర్పిస్తున్న జర్నలిజానికి, వాస్తవ పరిస్థితికి పొంతన లేదన్నారు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలని సూచించారు. శుక్రవారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో 2021–23 పీజీ జర్నలిజం బ్యాచ్ ఫేర్​వెల్ ప్రోగ్రాం జరిగింది. ముఖ్య వక్తగా హాజరైన కె.శ్రీనివాస్ మాట్లాడుతూ..ప్రస్తుతం డిజిటల్ మీడియా కీలకంగా మారిందని, దీంట్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా స్టూడెంట్లు స్కిల్స్ పెంచుకోవాలని సూచించారు. కొత్తగా నిర్మించిన రాష్ట్ర సచివాలయంలోకి మీడియా ప్రవేశంపై ఆంక్షలు విధించడం ప్రభుత్వానికే నష్టం కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు. ఏకమార్గంలో ప్రభుత్వం విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే పత్రికలు ప్రచురించాలని ప్రభుత్వాలు కోరుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షి చీఫ్‌‌‌‌ కార్టూనిస్టు శంకర్‌‌‌‌, వర్సిటీ జర్నలిజం డీన్ మారుపు వెంకటేశం, ప్రొఫెసర్లు సుధీర్ కుమార్, హసీనా, రామాంజని కుమారి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో విద్యార్థి ప్రతినిధులు వేణుగోపాల్, రాహుల్, జి.నవీన్, రామకృష్ణ, ఫసియొద్దీన్, ప్రియాంక పాల్గొన్నారు.