న్యూఢిల్లీ: పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ఎవరూ అడ్డుకోలేరని, కేవలం ఆందోళనలు చేస్తున్నారనే నెపంతో వారిపై లాఠీచార్జ్ చేయడం ఏమాత్రం తగదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిహార్, ఢిల్లీలో విద్యార్థుల నిరసనలపై పోలీసుల బలప్రయోగం, రక్షణ దళాల దాడిని నిరసిస్తూ దాఖలైన పిటిషన్లపై సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఆర్‌జేడీ నేత మనోజ్ ఝా దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు జులై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘చలో సంసద్’ మార్చ్ చేపట్టిన విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగంపై విచారణ కోరుతూ దాఖలైన ఇతర అర్జీలను సుప్రీంకోర్టు ఒకేచోట చేర్చింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వీ మోహనతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. నిరసనలు చేపట్టినంత మాత్రాన లాఠీచార్జ్ చేయడానికి వీల్లేదని, ప్రతి పౌరుడి హక్కును కాపాడాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వంపై ఉందని వ్యాఖ్యానించింది.
దేశవ్యాప్త మార్గదర్శకాలు..?
విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజలకు తమ సమస్యలపై నిరసన తెలిపే హక్కు ఉంది. వారికి సరైన స్థలాన్ని కేటాయించాలి. అందులో ఆటంకాలు ఉండకూడదు. అయితే, ఈ సమయంలో ఎవరైనా అసాంఘిక శక్తులు చొరబడి తప్పుచేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు” అని చెప్పారు. ఒకవేళ పోలీసుల వైపు నుంచి మితిమీరిన బలప్రయోగం జరిగి ఉంటే, దానిపై స్వతంత్ర విచారణ జరగాలని అభిప్రాయపడ్డారు.
‘‘ఎవరు బాధ్యులు..? ఏ రకమైన అతిక్రమణలు జరిగాయి..? భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలో పరిశీలించాలి. ఇది కేవలం ఢిల్లీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఒకేరకమైన నిబంధనలు అమల్లోకి రావాల్సిన అవసరం ఉంది’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక రకమైన ‘స్వయం క్రమశిక్షణ’ చాలా ముఖ్యమని గుర్తుచేసింది. ఆందోళనలు, నిరసనల టైంలో పోలీసులు, భద్రతా దళాలు ఎలా ప్రవర్తించాలనే దానిపై దేశవ్యాప్త మార్గదర్శకాలు రూపొందించే విషయాన్ని పరిశీలిస్తామని కోర్టు సంకేతాలిచ్చింది. ఈ వ్యవహారంలో నిష్పాక్షికంగా కోర్టుకు సహకరిస్తామని ఎస్జీ తుషార్ మెహతా తెలిపారు. ఈ కేసు విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
పోలీసులకు రక్షణ కవచాలు ఎందుకు ఇవ్వరు..?
పెద్ద ఎత్తున జరిగే ప్రదర్శనలను అదుపు చేసే సమయంలో పోలీసులకు తగిన హెల్మెట్లు, ఇతర రక్షణ పరికరాలు అందించకపోవడంపై సుప్రీంకోర్టు విచారం వ్యక్తంచేసింది. విచారణ సమయంలో పోలీసుల కుటుంబాల తరఫున హాజరైన న్యాయవాది వాదిస్తూ.. నిరసనల్లో కొందరు పోలీసులపై దాడి చేసి, గాయపరిచారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన జస్టిస్ బెనర్జీ..‘‘బాధితులు సాధారణ పౌరులైనా లేదా పోలీసులైనా.. ప్రతి ఒక్కరి గాయాలు కోర్టుకు సమానంగా ఆందోళన కలిగిస్తాయి. ఇంత పెద్ద నిరసనలను ఎదుర్కొనేటప్పుడు పోలీసులకు రక్షణ పరికరాలు ఎందుకు ఇవ్వట్లేదని రాష్ట్రాలను అడుగుతం’’ అని అన్నారు.
