ఆగస్టు 19న టీచర్ల మహాధర్నా

ఆగస్టు 19న టీచర్ల మహాధర్నా
  • సమస్యల పరిష్కారం కోసం ‘తపస్’ కార్యాచరణ ప్రకటన 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని టీచర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వచ్చేనెల 19న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నారు. ఈమేరకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతరావు, నవాత్ సురేష్  తెలిపారు. మంగళవారం నిర్వహించిన తపస్ నేతల సమావేశంలో హనుమంతరావు, నవాత్ సురేష్ మాట్లాడుతూ.. జీవో 317 ద్వారా అనేకమంది టీచర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీచర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ఏర్పడితే సమస్యలు పరిష్కారం అవుతాయని భావించామని 9 ఏండ్లు అవుతున్నా సమస్యలు యథాతథంగా ఉన్నాయన్నారు. 

2002, 2003 డీఎస్సీ టీచర్లకు పాత పింఛన్ విధానం అమలుచేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమస్యలను పరిష్కారం కోసం తపస్ ఉద్యమ కార్యాచరణను నేతలు ప్రకటించారు. ఈ నెల 18 నుంచి 22 వరకూ క్లాంప్లెక్స్ స్థాయిలో  టీచర్ల సంతకాల సేకరణ,  25న తహసీల్దార్ ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. 31న ఆర్డీఓలకు వినతిపత్రాలు ఇవ్వాలని, ఆగస్టు 5న కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించనున్నామని నేతలు ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షురాలు ఉషారాణి, వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్, మల్లికార్జున్, కళావతి పాల్గొన్నారు.