ఆ పేషెంట్‌కు సీరియస్‌గా ఉందన్న మాటలో నిజం లేదు: ఈటల

ఆ పేషెంట్‌కు సీరియస్‌గా ఉందన్న మాటలో నిజం లేదు: ఈటల

తెలంగాణలో కరోనా వ్యాప్తి నియంత్రణకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర తెలిపారు. ఇప్పటి వరకు మన తెలంగాణ గడ్డపై ఒక్కరికి కూడా ఈ వైరస్ సోకలేదని చెప్పారు. రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారేనని, ఇవాళ మరొకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని వివరించారు. దీనితో రాష్ట్రంలో డిశ్చార్జ్ అయిన తొలి పేషెంట్‌తో కలిపి కరోనా కేసుల సంఖ్య ఆరుకు చేరిందన్నారు ఈటల. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఐదుగురికి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇండోనేషియా నుంచి వచ్చిన పేషెంట్‌కు సీరియస్‌గా ఉందన్న వార్తలో నిజం లేదని స్పష్టం చేశారు. వెంటిలేటర్‌పై ఉంచడం లాంటివేం జరగలేదని తెలిపారు.

రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై కోఠీలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో బుధవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించారు మంత్రి ఈటల. రాష్ట్రంలో ఎట్టిపరిస్థితుల్లోనూ కరోనా వ్యాపించకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగులకు సెలవులు రద్దు చేశామని వెల్లడించారు. అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చామని తెలిపారాయన. అయితే విద్యాసంస్థలకు సెలవు ఇచ్చింది వాళ్లు ఇంటిలో ఉండి వైరస్ నుంచి కాపాడుకోవడానికేనని, మాల్స్, పార్కుల్లో తిరగడానికి కాదని చెప్పారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు.

గుడి, మసీదు, చర్చిలకు వెళ్లొద్దు

జనాలు ఎక్కువగా గుమ్మిగూడకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు మంత్రి ఈటల రాజేంద్ర. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు 200 మంది దాటకుండా చేసుకోవాలని సూచించారు. ఆఫీసుల్లో, మాల్స్‌లో శానిటైజర్లు తప్పనిసరిగా పెట్టాలన్నారు. ఈ ఏడాది శ్రీరామ నవమి గ్రాండ్‌గా పందిళ్లు వేసి చేయొద్దని, టెంపుల్స్‌లోనే పూజలు చేయాలని చెప్పారు మంత్రి. భక్తి మనసులో ఉండాలని, గుడికే వెళ్తేనే భక్తి ఉన్నట్టు కాదని, పండుగలు మళ్లీ మళ్లీ వస్తాయని, వైరస్ బారినపడకుండా మనల్ని మనమే కాపాడుకోవాలని అన్నారు. ఆదివారం, శుక్రవారం చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలకు వెళ్లొద్దని సూచించారు. ఇంట్లోనే ఉండి ప్రేయర్ చేసుకోవాలన్నారు.

దాచుకుంటే ద్రోహం చేసినట్టే

రాష్ట్రంలో ఎటువంటి అనూహ్యమైన పరిస్థితులు వచ్చినా ఎదుర్కునేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు మంత్రి ఈటల. తెలంగాణలో 5వేల మందిని ఐసోలేషన్‌లో ఉంచి ట్రీట్మెంట్ చేసేందుకు‌, 25 వేల మందికి క్వారంటైన్‌లో పెట్టేందుకు సరిపడా ఏర్పాట్లు చేశామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారెవరూ వైద్య అధికారులను సమాచారం ఇవ్వకుండా ఉండొద్దని కోరారు. అలా ఎవరైనా ఆ సమాచారాన్ని చెప్పకుండా దాచుకుంటే ద్రోహం చేసినట్లేనని అన్నారు. ఎటువంటి లక్షణాలు లేకున్నా 14 రోజుల పాటు వాళ్లు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని, ఒక వేళ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుందని చెప్పారు. ఎవరైనా విదేశాల నుంచి వచ్చిన వారు చెప్పకున్నా ఆశా వర్కర్లు వారి వివరాలను సేకరించాలని సూచించారు.