నీట్‌‌ ఫస్ట్ ర్యాంక్ మనోడికే

నీట్‌‌ ఫస్ట్ ర్యాంక్ మనోడికే
  • వంద పర్సంటైల్ సాధించిన హైదరాబాదీ స్టూడెంట్ మృణాల్
  • మొత్తంగా ముగ్గురికి టాప్‌‌ ర్యాంక్
  • ఫలితాలు రిలీజ్ చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాదీ స్టూడెంట్‌‌ మృణాల్ కుటేరి.. నీట్‌‌లో ఆలిండియా నంబర్ వన్ ర్యాంక్ సాధించాడు. అతడికి 99.99 పర్సంటైల్‌‌తో 720 మార్కులు వచ్చాయి. ఢిల్లీ స్టూడెంట్ తన్మయ్ గుప్త, మహారాష్ట్ర స్టూడెంట్‌‌ కార్తీక జి.నాయర్‌‌‌‌ కూడా 720 మార్కులు తెచ్చుకున్నారు. దీంతో ఈ ముగ్గురికీ ఉమ్మడిగా టాప్‌‌ ర్యాంకును ఇస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌‌టీఏ) సోమవారం ఫలితాలు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌‌ స్టూడెంట్‌‌ చందం విష్ణు వివేక్‌‌, తెలంగాణ స్టూడెంట్‌‌ కె.శశాంక్‌‌ 715 మార్కులతో ఆల్‌‌ఇండియా ఐదో ర్యాంకర్లు‌‌గా నిలిచారు. రాష్ట్రానికి చెందిన కాస లహరి 30వ ర్యాంక్‌‌, శ్రీనిజ 38వ ర్యాంక్‌‌, నిహారిక 56వ ర్యాంక్, పసుపునూరి శరణ్య 60వ ర్యాంక్‌‌ సాధించారు.
44.6 శాతం మంది ఫెయిల్

 నీట్‌‌లో గతేడాది 56.43 శాతం మంది క్వాలిఫై అయ్యారు. ఈసారి 56.34 శాతం మంది అర్హత సాధించారు. 44.6 శాతం మంది క్వాలిఫై కాలేదు. 6,81,168 మంది అబ్బాయిలు ఎగ్జామ్ రాయగా, 3,75,260 (55.09శాతం) మంది క్వాలిఫై అయ్యారు. 8,63,093 మంది అమ్మాయిలు ఎగ్జామ్ రాయగా, 4,94,806 (57.32) మంది క్వాలిఫై అయ్యారు. 14 మంది ట్రాన్స్‌‌జెండర్లు నీట్‌‌కు అటెండ్ కాగా.. 8 మంది అర్హత సాధించారు. ఏయే రాష్ట్రంలో ఎంత మంది రాశారు, ఎంత మంది క్వాలిఫై అయ్యారనే విషయాన్ని ఎన్‌‌టీఏ ప్రకటించలేదు. ఉత్తీర్ణత శాతం కొన్ని రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా, కొన్ని రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉంటుండడంతో వివాదాలు ఏర్పడుతున్నాయి. దీంతోనే రాష్ట్రాల వారీగా పాస్ పర్సంటేజ్‌‌ను విడుదల చేయలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ నుంచి సుమారు 51 వేల మంది నీట్‌‌కు హాజరైనట్టు సమాచారం.