కొన్నాళ్లపాటు కాంపిటేటివ్ టెన్నిస్‌ ఆడతా

 కొన్నాళ్లపాటు కాంపిటేటివ్ టెన్నిస్‌ ఆడతా

టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ రిటైర్ అయిన నేపథ్యంలో..తాను ఇప్పట్లో రిటైర్ కాబోనని బ్రిటన్ టెన్నిస్ ప్లేయర్ ఆండీ ముర్రే అన్నాడు. అసలు రిటైర్మెంట్పై ఆలోచన లేదన్నాడు. మరికొన్నేళ్ల పాటు కాంపిటేటివ్ టెన్నిస్ ఆడతానని చెప్పుకొచ్చాడు. అయితే తాను మాత్రం 20 గ్రాండ్ స్లామ్ విజేత ఫెదరర్లా ఘనంగా వీడ్కోలు పలకలేనని వెల్లడించాడు. ఫెదరర్లా అద్భుత వీడ్కోలు మ్యాచ్ ఆడేందుకు తనకు అర్హత లేదన్నాడు. లావర్ కప్‌లో రోజర్ ఫెదరర్ అంతర్జాతీయ ఆటల కెరీర్ ముగింపును స్వాగతించిన ముర్రే... భావోద్వేగ సన్నివేశాలు "సూపర్ స్పెషల్" అని కామెంట్ చేశాడు. 

ఫెదరర్ మ్యాచ్ చూడటమే గొప్ప..
ఇప్పట్లో నేను రిటైర్ అవను. అయితే రిటైర్మెంట్ ఆలోచన వచ్చినప్పుడు ప్రకటిస్తా. కానీ ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేను. కొన్నాళ్లపాటు కాంపిటేటివ్ టెన్నిస్‌ ఆడతా. ప్రస్తుతం ఫిట్ నెస్ పరంగా బాగానే ఉన్న.  అయితే గెలుపు అంచుల వరకు వచ్చి ఆఖర్లో ఓడిపోతున్న సందర్భాల నుంచి బయటపడాలి.  అని ముర్రే తెలిపాడు.  వీడ్కోలు పలికేటప్పుడు మాత్రం తనకు స్పెషల్‌ మ్యాచ్‌ ఆడే అర్హత లేదని అనుకుంటున్న. దీనికి ఫెదరర్ మాత్రమే అర్హుడు. దిగ్గజం చివరి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడమే ప్రత్యేకత...అని ముర్రే చెప్పాడు. 

ఫెదరర్ రిటైర్మెంట్..
టెన్నిస్‌ దిగ్గజం రోజర్ ఫెదరర్‌  ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. లావెర్‌ కప్‌లో చివరిసారిగా రోజర్‌తో కలిసి  రఫేల్ నాదల్‌  బరిలోకి దిగాడు. సోక్, టియాఫో జోడీ చేతిలో 6-4, 6(2)-7, 9-11 తేడాతో  ఫెదరర్, నాదల్  జోడీ ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఓడిన తర్వాత ఫెదరర్‌, రఫేల్‌ సహా టెన్నిస్‌ అభిమానులు కన్నీళ్లు పెట్టుకొన్నారు.