కామెంట్ చేశాడని కొట్టిన బీజేపీ లీడర్ సోనాలీ ఫోగట్
న్యూఢిల్లీ: టిక్ టాక్ లో ఫేమస్ అయి, బీజేపీ లీడర్ గా మారిన హర్యానాకు చెందిన సోనాలీ ఫోగట్ మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చారు. శుక్రవారం అగ్రికల్చర్ మార్కెట్ కు వెళ్లిన ఆమె అక్కడ రైతులు ఇచ్చిన కంప్లయింట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)కి చెందిన సుల్తాన్ సింగ్ అనే ఆఫీసర్ అభ్యంతరకరంగా కామెంట్ చేయడంతో సోనాలీ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. కాలి చెప్పు తీసుకుని ఆయనను మళ్లీ మళ్లీ కొట్టారు. దీంతో ఆమె కంప్లయింట్లను పరిశీలించి, అన్నింటినీ పరిష్కరిస్తానంటూ ఆయన ప్రాధేయపడటం వీడియోలో కనిపించింది. సోనాలీ చెప్పుతో కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ ఆఫీసర్ తర్వాత సారీ చెప్పడంతో ఆమె కేసు పెట్టలేదని వార్తలు వచ్చాయి. ఒక ఆఫీసర్ పై దాడి చేసినందుకు ఆమెపై యాక్షన్ తీసుకోవాలని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ను కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా డిమాండ్ చేశారు. సోనాలీ ఫోగట్ 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా.. భారత్ మాతాకీ జై అనని వాళ్ల ఓట్లకు విలువ లేదని కామెంట్ చేసిన ఆమె పెద్ద దుమారం రేపారు. గత ఏడాది తనపై దాడి చేశారంటూ అక్క, బావపై కూడా ఆమె పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు.