కబ్జా చేశానని ఒప్పుకున్నంక.. పదవిలో ఎందుకున్నడు?.: తుల్జాభవానీ

కబ్జా చేశానని ఒప్పుకున్నంక.. పదవిలో ఎందుకున్నడు?.: తుల్జాభవానీ
  • ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని ప్రశ్నించిన కూతురు తుల్జా భవానీరెడ్డి
  • కన్న కూతురుపై ఈ కేసులేంటని నిలదీత
  • భర్తతో కలిసి జనగామ పోలీస్​ స్టేషన్ లో విచారణకు హాజరు

జనగామ, వెలుగు :  ‘‘చేర్యాల భూమిని  కబ్జా చేసినట్లు ఆయనే ఓపెన్​గా ఒప్పుకున్నంక ఇంకా పదవిలో ఎందుకు ఉన్నడు..  రాజీనామా ఎందుకు చెయ్యలేదు.. కన్న కూతురి పై ఈ కేసులేంటి”అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఆయన కూతురు తుల్జా భవానీ రెడ్డి ఫైర్​ అయ్యారు.  బుధవారం ఆమె తన భర్త రాహుల్​ రెడ్డితో కలిసి జనగామ పోలీస్​ స్టేషన్​కు వచ్చారు.  గత నెల 27న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తన విధులకు కూతురు తుల్జా భవానీ రెడ్డి అడ్డు తగులుతోందని హైకోర్టు లో రిట్​ పిటిషన్​ వేశారు.  ఈ నేపథ్యంలో పోలీసు విచారణలో భాగంగా ఆమె జనగామకు వచ్చారు.  

 డీసీపీ సీతారామ్​తో కాసేపు మాట్లాడిన తర్వాత టౌన్​ పోలీస్​ స్టేషన్​కు చేరుకున్నారు.  దాదాపు మూడున్నర గంటల పాటు టౌన్​ సీఐ శ్రీనివాస్​ యాదవ్​ విచారణ జరిపారు.  తర్వాత తుల్జా భవానీరెడ్డి మీడియాతో మాట్లాడారు.  ‘‘నేను జనగామకు రావద్దని ఆయన (ముత్తిరెడ్డి) అర్జీ పెట్టుకున్నడు.. ప్రజల ముందు ఆయన చేసిన తప్పులను బయటపెట్టొద్దు. అందరి ముందు అడిగితే పరువు పోతుందని అనుకుంటున్నడు.. ఈ విషయం పై  సీఎం కేసీఆర్​కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీఎంకు అన్నీ తెలుసు. తను చేయాల్సింది చేస్తడు. మా నాన్న దగ్గర సమాధానం లేక ఇలాంటి పనులు చేస్తున్నడు. కన్న బిడ్డ పై కేసులు పెడ్తరా..?” అని ముత్తిరెడ్డిని ప్రశ్నించింది.  కబ్జా పెట్టిన అని ఓపెన్​గా ఒప్పుకున్న ఆయనపై విచారణ చేయాలని,  ఆయన వివరణ ఇవ్వకపోగా నా పై ఈ కేసులు ఏంటన్నారు.  వాటి గురించి తెలుసుకునేందుకే స్టేషన్​కు వచ్చానని తెలిపారు. తప్పు జరిగిందని తెలిసి చేర్యాల మున్సిపాలిటీకి భూమి ఇచ్చానని, దీనిని స్వాగతిస్తున్న నని చెప్తూనే కేసులు వేయడం ఎందుకు..?  అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి జరుగుతున్నప్పుడు అడ్డుకోవడంతోనే ఆయన బుద్ధి తెలుస్తుంది. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ప్రజల భూమిని కాపాడుతాడా.. కబ్జా పెడ్తాడా..? ఆయన చేసే పనులా ఇవా? అని నిలదీశారు. పైగా తాను సదరు చేర్యాల భూమిని  కన్​స్ట్రక్షన్​ చేసుకునేందుకు ఇవ్వమన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. 2020లో కొన్న భూమికి 2018లోనే పర్మిషన్​ తెచ్చుకున్న మనిషి ఇటువంటి అబద్ధాలు చెప్పలేడా..? అని మండిపడ్డారు.  తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, ఎక్కడా పోటీ చేయనని అన్నారు.  తన ఇంటికి వచ్చి బెదిరింపులకు దిగుతున్నాడని చెప్పారు.