
శంషాబాద్, వెలుగు: నాలుగు రోజుల కింద కలకలం సృష్టించిన చిరుతపులి మరోసారి శంషాబాద్ ఎయిర్‌పోర్టు రన్ వే పైకి వచ్చింది. ఆ దృశ్యాలు రన్‌వే సమీపంలో ఫారెస్ట్ఆఫీసర్లు ఏర్పాటు చేసిన ట్రాప్కెమెరాలకు చిక్కాయి. గత ఆదివారం ఎయిర్పోర్ట్రన్వే పై కనిపించిన చిరుత సమీప అటవీ ప్రాంతంలోకి జారుకుంది. ఆ తర్వాత రెండ్రోజులు జాడ లేదు. మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మరోసారి రన్‌వేపైకి వచ్చింది. అక్కడ ఏర్పాటు చేసిన ట్రాప్బోను వద్ద కొన్ని గంటల పాటు చక్కర్లు కొట్టింది. ఆ దృశ్యాలు ట్రాప్‌కెమెరాల్లో రికార్డ్అయ్యాయి. ప్రస్తుతం ఎయిర్‌పోర్టు ఏరియాలో చిరుతపులి కోసం గాలింపు కొనసాగుతోంది.
ఫారెస్ట్ఆఫీసర్లు చిరుతను పట్టుకునేందుకు ఐదు బోన్లు ఏర్పాటు చేశారు. మేకలను ఎరగా పెట్టారు. బోను దాకా వచ్చి చిరుత జారుకుందని తెలిసి సమీప ప్రాంతాల్లోని జనం ఆందోళన చెందుతున్నారు. ఎయిర్‌పోర్టు ప్రహరీని ఆనుకుని ఉన్న పెద్ద గోల్కొండ, గొల్లపల్లి, రషీద్ గూడ గ్రామాల రైతులు భయపడుతున్నారు. కూరగాయలు, పూలు తెంపేందుకు రాత్రిళ్లు, తెల్లవారుజామున పొలాల వద్దకు వెళ్లాలంటే భయంగా ఉందని, కూలీలు కూడా రావడం లేదని వాపోతున్నారు. చేతికందిన పూలు, కూరగాయలను పొలాల్లోనే వదిలేయాల్సి వస్తుందని, నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా పట్టుకోవాలని కోరుతున్నారు.
ఒంటరిగా తిరగొద్దు..
శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీప గ్రామాల ప్రజలు ఒంటరిగా తిరగొద్దని, రాత్రిళ్లు, తెల్లవారుజామున జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గుంపులుగా తిరగాలని, అటవీశాఖ, ఎయిర్‌పోర్టు అధికారులు 24 గంటలు పర్యవేక్షిస్తున్నారని, చిరుత సంచారం ఉన్న ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. గొల్లపల్లి, రషీద్ గూడ, బహదూర్ గూడ , మామిడిపల్లి, బహదూర్ అల్లి మక్తా ప్రాంతలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రెస్క్యూ టీమ్ గస్తీ నిర్వహిస్తోందని చెప్పారు. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌తో సహా సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారని, చిరుత కనిపిస్తే వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.