- 13 వారసత్వ కుటుంబాలకు పంపకం
- తల్లులకు సమర్పించిన బెల్లం కూడా వీరికే..
- ఈసారి కానుకలు రూ.14 కోట్లు దాటే అవకాశం
వరంగల్, వెలుగు: తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క–సారక్క జాతర ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ప్రధాన పూజారుల చేతులమీదుగా నిర్వహిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాట్లు చేసినా, జాతర నిర్వహణ మొత్తం ఆదివాసీ సంప్రదాయం ప్రకారమే సాగుతుంది. వేములవాడ, యాదాద్రి వంటి ఆలయాల్లా కాకుండా, ఇక్కడి పూజారులు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. అయినప్పటికీ మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు సైతం పూజారుల కమిటీ సూచనల ప్రకారమే వ్యవహరిస్తారు.
అందుకే జాతరలో హుండీ ద్వారా సమకూరిన ఆదాయంలో పూజారులకు మూడో వంతు(33.33 శాతం) ఇవ్వడం ఆనవాయితీ. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ జాతరకు భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. 2022లో కోటి మంది, 2024లో కోటిన్నర మంది, ఈసారి దాదాపు రెండున్నర కోట్ల మంది భక్తులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. హుండీ ఆదాయంలో వాటానే కాకుండా జాతర సందర్భంగా మంచినీటి దుకాణాలు, వైన్‌షాపులు, ఇతర టెండర్లలో స్థానిక పూజారులు సూచించిన వారికే ప్రాధాన్యం ఇస్తుంటారు.
ఈసారి రూ.4.20 కోట్లు..
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ మేడారం హుండీ కానుకల్లో 33.33 శాతం వాటా ప్రధాన పూజారుల కుటుంబాలకు అందజేస్తోంది. ప్రస్తుతం 13 వారసత్వ పూజారి కుటుంబాలు ఈ మొత్తాన్ని అందుకుంటాయి. 2020, 2022 జాతరల్లో హుండీల ద్వారా సుమారు రూ.12 కోట్లు, 2024లో రూ.13.25 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి హుండీల ఆదాయం రూ.14 కోట్లు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలా జరిగితే అందులో 33.33 శాతం మేరకు సుమారు రూ.4 కోట్ల 20 లక్షలు పూజారుల కుటుంబాలకు దక్కనున్నాయి.
ఈ మొత్తాన్ని సమ్మక్క, సారక్క, పడిగిద్దరాజు, గోవిందరాజుల పూజారులు సంప్రదాయాల ప్రకారం పంచుకుంటారు. హుండీ ఆదాయంతో పాటు భక్తులు సమర్పించే బంగారం(బెల్లం)ను కూడా పూజారుల కుటుంబాలకే అప్పగిస్తారు. జాతరలో సమకూరే బెల్లాన్ని ట్రాక్టర్ల ద్వారాతరలించి నిల్వ చేసి జాతర ముగిశాక పూజారుల కుటుంబాలకు వారి వాటాల ప్రకారం పంచుతారు.
వారసులు పెరగడంతో తగ్గుతున్న వాటా..
హుండీ ఆదాయంలో పూజారులకు కేటాయించిన ఆదాయంలో నుంచి 15 శాతం ఆలయాల అభివృద్ధి, దూపదీపాల కోసం రిజర్వ్ ఫండ్‌గా కేటాయిస్తారు. మిగిలిన 85 శాతాన్ని 13 ప్రధాన పూజారుల కుటుంబాలకు పంచుతారు. దీంతో ఒక్కో ప్రధాన పూజారికి సగటున రూ.26 లక్షల వరకు వస్తుంది. కొన్ని కుటుంబాల్లో వారసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఒక్కొక్కరికి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు మాత్రమే వాటా అందుతోంది.
రెండో రోజు ఆదాయం రూ.3.54 కోట్లు
మేడారం జాతర సందర్భంగా భక్తులు హుండీల్లో వేసిన కానుకలను అధికారులు హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో పోలీసు నిఘా, సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కిస్తున్నారు. రెండో రోజైన శుక్రవారం 160 హుండీలను తెరవగా రూ.3 కోట్ల 54 లక్షల 25 వేల 200 ఆదాయం లభించింది. మొదటి రోజైన గురువారం 125 హుండీల లెక్కింపులో రూ.2 కోట్ల 49 లక్షల 65 వేలు వచ్చాయి.
ఇప్పటివరకు రెండు రోజుల్లో మొత్తం 285 హుండీలను తెరవగా.. రూ.6 కోట్ల 4 లక్షల 53 వేల 636 ఆదాయం సమకూరింది. గత జాతరతో పోలిస్తే ఈసారి 288 హుండీలు అదనంగా ఏర్పాటు చేయడంతో గద్దెల వద్ద మొత్తం 828 హుండీలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
