దళపతి విజయ్ నటించిన “జన నాయగన్” సినిమా విడుదలపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొదట ఈ సినిమా జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా, అనేక అడ్డంకుల కారణంగా వాయిదా పడింది. సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, కోర్టు కేసులు చుట్టుముట్టడంతో విడుదలపై సందిగ్ధత కొనసాగుతోంది. అటు తమ అభిమాన నటుడి ఆఖరి చిత్రం కోసం అభిమానులు, హక్కులు సొంతం చేసుకున్న ట్రేడ్ వర్గాలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ క్రమంలో సినిమా విడుదల అంశంపై పలుమార్లు విచారణ జరిగినప్పటికీ, ఇప్పటివరకు తీర్పు మేకర్స్‌కు అనుకూలంగా రాలేదు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, నిర్మాతలు సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు వేగవంతం చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సూచించిన కట్స్, మార్పులకు చిత్రబృందం అంగీకరించినట్లు తెలుస్తోంది. అవసరమైన ఎడిట్స్ పూర్తి చేసి, ఫైనల్ కట్ వెర్షన్‌ను త్వరలోనే కమిటీకి సమర్పించి విడుదలకు అనుమతి పొందాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం.
ALSO READ : ప్రభాస్‌కు అంతర్జాతీయ గౌరవం..
ఫైనల్ కట్ సిద్ధమైన వెంటనే, ఈ చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ CBFCపై వేసిన పిటిషన్‌ను బేషరతుగా వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, ‘జన నాయగన్’ సినిమాను ఫిబ్రవరి 19 లేదా 20 తేదీల్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
అయితే, ఫిబ్రవరి నెలలో విడుదల సాధ్యం కాకపోతే, తమిళనాడు ఎన్నికలు ముగిసే వరకు సినిమాను వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా అయితే, తదుపరి విడుదల తేదీ మే 2026 వరకు వెళ్లే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు, సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
