చాలా కాలంగా ఆగుతూ సాగుతూ వచ్చిన ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. తాజాగా రెండు దేశాల మధ్య జరిగిన మధ్యంతర ట్రేడ్ డీల్ ద్వారా ఇండియాపై ఉన్న ఎగుమతి సుంకాలను అమెరికా ఏకంగా 18 శాతానికి తగ్గించింది. దీంతో దేశీయ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో తిరిగి రారాజులుగా వెలుగుతాయని మోడీ ప్రభుత్వం చెబుతోంది. తాజా ట్రేడ్ డీల్ వల్ల భారతీయ రైతులకు ఎలాంటి నష్టం లేదని పైగా వారికే చాలా లాభదాయకమంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.
అమెరికాతో కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందం భారత ఎగుమతిదారులకు ఏకంగా 30 ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌ను అందుబాటులోకి తెస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఈ ఒప్పందం వివరాలను వెల్లడిస్తూ.. దేశ ప్రయోజనాలకు ఎక్కడా విఘాతం కలగకుండా భారత్ తన పట్టు నిలుపుకుందని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం వల్ల ప్రధానంగా భారత రైతులకు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు భారీ ప్రయోజనం చేకూరనుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ వంటి ప్రాంతాల హస్తకళాకారులకు ఈ ఒప్పందం కొత్త ఆర్డర్లను, ఉపాధిని తెచ్చిపెడుతుందని గోయల్ ఉదాహరించారు.
ALSO READ : బెంగళూరు ఆటోవాలలపై ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ ఫైర్..
వ్యవసాయ రంగంలో మనం స్వయం సమృద్ధి సాధించిన ఏ ఒక్క ఉత్పత్తిపై కూడా దిగుమతి రాయితీలు ఇవ్వలేదని గోయల్ స్పష్టం చేశారు. అమెరికా నుంచి కేవలం రెడ్ సోర్గం, ట్రీ నట్స్, వైన్ వంటి కొన్ని ఎంపిక చేసిన వస్తువులకు మాత్రమే పరిమితంగా మార్కెట్ యాక్సెస్ ఇచ్చినట్లు చెప్పారు.
భారత రైతులకు దక్కేది ఇదే:
తాజా డీల్ ద్వారా భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అమెరికాలో 'జీరో డ్యూటీ' లభించనుంది. అంటే రైతులు ఎలాంటి అదనపు పన్నుల భారం లేకుండా ఎగుమతి చేసుకోవచ్చు. టీ, కాఫీ, మసాలా దినుసులు, కొబ్బరి నూనె వంటివి ఎటువంటి టారిఫ్ లేకుండా అమెరికా మార్కెట్లోకి ఎంట్రీని సొంతం చేసుకున్నాయి. వీటితో పాటు అరటి, మామిడి, జామ, అవకాడో, కివి, పైనాపిల్, పుట్టగొడుగులు, బార్లీ, జీడిపప్పు, అరికా నట్స్, బ్రెజిల్ నట్స్, వెజిటెబుల్ వ్యాక్స్ సహా కొన్ని బేకరీ ఉత్పత్తులు తృణధాన్యాలకు కూడా పన్ను మినహాయింపు లభించింది. ఇది మన రైతుల ఆదాయాన్ని పెంచడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భారతీయ ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచుదన్నారు కేంద్ర మంత్రి గోయల్.
ALSO READ : ఇంటర్నెట్ సెన్సేషన్ మేజర్ రిషబ్ సింగ్: ఎవరు ఈ రియల్ హీరో ?
కేవలం వ్యవసాయమే కాకుండా.. ఇతర కీలక రంగాల్లోనూ భారత్ భారీ ఊరట పొందింది. ముందుగా భారత్ నుంచి ఎగుమతయ్యే వజ్రాలపై ఇకపై ఎటువంటి పన్ను ఉండదు. అలాగే భారీ ఎత్తున ఎగుమతి అయ్యే భారతీయ మందులకు అమెరికా మార్కెట్లో సున్నా పన్ను వర్తిస్తుంది. ఇదే క్రమంలో భారత్‌లో తయారయ్యే స్మార్ట్‌ఫోన్లు అమెరికాలో జీరో డ్యూటీ ప్రయోజనాన్ని కొనసాగిస్తాయి.
మార్చి మధ్యలో ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు జరగనున్నాయి. ట్రంప్ ప్రభుత్వంతో సుదీర్ఘంగా సాగిన చర్చల తర్వాత కుదిరిన డీల్.. భారత ఎగుమతిదారులకు కొత్త అవకాశాలను తెరుస్తుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. భారత రైతుల ప్రయోజనాలను రక్షించడమే కాకుండా.. విదేశీ మార్కెట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు పడ్డాయి.
